అసెంబ్లీ ఎన్నికల కోసం వైయస్ఆర్‌సీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా.. ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం. అందుకోసం ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు.అధికార పార్టీ వైయస్ఆర్‌సీపీ భారీ ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతోంది. ఈ నెల 26 లేదంటే 27వ తేదీ నుంచి ఆ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో దాదాపు 21రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఒక పార్లమెంటరీ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కొనసాగనుందని తెలుస్తోంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా నెలరోజులపాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది.మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా.. ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తద్వారా ఈ యాత్రలో ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారాయన. తొలి విడతలో బస్సు యాత్ర, ఆతర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఇప్పటికే రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు నిర్వహించబోతుంది వైయస్ఆర్‌సీపీ. బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలోకి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. బస్సు యాత్రపై, సభలపై పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తామని వైయస్ఆర్‌సీపీ చెబుతోంది. ఇక.. ఎన్నికల కార్యాచరణ రూపొందించుకోవడానికి పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో ఇవాళ మధ్యాహ్నాం ఆయన భేటీ కానున్నారు. జిల్లాలు.. నియోజకవర్గాల వారీగా సీఎం జగన్ ప్రచార పర్యటనలు ప్రధానాంశంగా ఈ భేటీ జరగనున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఏయే తేదీల్లో ఎక్కడెక్కడ పర్యటనలు కొనసాగాలి.. రూట్ మ్యాప్ ఎలా సాగాలి.. తదితర అంశాలపై ఈ కీలక సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే.. మూడు పార్టీల కూటమి బండారాల్ని ప్రజల ముందు ఉంచేలా కార్యచరణ రూపకల్పన, జిల్లాల వారీగా పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ ఒక ట్రెండ్ సెట్టర్. గత ఎన్నికలప్పుడు.. విజయ శంఖారావం పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించి 151 స్థానాలు దక్కించుకుని సూపర్ సక్సెస్ అయ్యారాయన. ఉత్తరాంధ్ర ఇచ్ఛాపురం నుంచి మొదలుపెట్టి.. రోడ్‌షోలు, బహిరంగ సభలతో జనాల్లోకి బలంగా దూసుకుపోయారు. ఈ క్రమంలో.. ఈసారి ఆయన ప్రచార శైలిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.