ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమ రోహింగ్యాలకు భారత్‌లో స్థిరపడే హక్కు లేదు.. కేంద్రం సంచలన ప్రకటన

national |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 10:44 PM

దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యా ముస్లిం వలసదారులకు భారత్‌లో స్థిరపడే హక్కులేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చట్టవిరుద్ధంగా ప్రవేశించేవారికి శరణార్థి హోదాను కల్పించే ప్రత్యేక వర్గాన్ని సృష్టించేందుకు శాసనసభ, పార్లమెంటు, కార్యనిర్వాహక విధానాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోజాలదని ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడ్‌విట్ దాఖలు చేసింది. ఇందుకు సంబంధించి పలు సందర్భాల్లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను కేంద్రం ప్రస్తావించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం విదేశీయుడు జీవించే హక్కు, స్వేచ్ఛను మాత్రమే అనుభవిస్తాడని, దేశంలో నివసించే, స్థిరపడే హక్కు లేదని, ఇది కేవలం భారతీయ పౌరులకు మాత్రమే పరిమితమని పేర్కొంది.


ఐక్యరాజ్యసమితి శరణార్ధుల హైకమిషనర్ శరణార్థి కార్డులను భారత్ గుర్తించలేదని, శరణార్థి హోదాను పొందడానికి కొంతమంది రోహింగ్యా ముస్లింలు దీనిని ప్రాతిపదికగా ఉపయోగించారని తెలిపింది. భారత్ ఇప్పటికే పొరుగు దేశం (బంగ్లాదేశ్) నుంచి పెద్ద ఎత్తున అక్రమ వలసలతో పోరాడుతోందని, ఇది కొన్ని సరిహద్దు రాష్ట్రాల (అసోం, పశ్చిమ బెంగాల్) జనాభా స్థితిని మార్చిందని పేర్కొంది. ‘రోహింగ్యాలు భారత్‌లోకి అక్రమ వలసలను కొనసాగించడం, దేశంలో వారు నివసించడం, ఇది పూర్తిగా చట్టవిరుద్ధం కాకుండా, తీవ్రమైన భద్రతాపరమైన మార్పులతో కూడుకుని ఉంది’ అని వివరించింది.


పెద్ద సంఖ్యలో రోహింగ్యాలు నకిలీ గుర్తింపు పత్రాలతో మానవ అక్రమ రవాణా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసకర కార్యకలాపాలు, అంతర్గత, జాతీయ భద్రతకు ముప్పు వంటివి కలిగిస్తున్నారని విశ్వసనీయ సమాచారం ఉందని తెలిపింది. నిర్బంధంలో ఉన్న రోహింగ్యాలను విడుదల చేయాలంటూ పిటిషనర్ ప్రియాలీ సుర్ చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ.. అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారిపై చట్టంలోని నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని ప్రభుత్వం తెలిపింది.


1951 శరణార్థుల ఒప్పందం, శరణార్థుల స్థితికి సంబంధించిన ప్రోటోకాల్‌పై భారత్ సంతకం చేయలేదని, రోహింగ్యాల విషయంలో స్వంత విధానం ప్రకారం వ్యవహరిస్తుందని కేంద్రం వెల్లడించింది. రోహింగ్యాలను టిబెట్, శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థులతో సమానంగా చూడాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తిపై మండిపడింది. ‘ఏ తరగతి వ్యక్తులనైనా శరణార్థులుగా గుర్తించాలా? వద్దా? అనేది? విధానపరమైన నిర్ణయం. శాసన పరిధికి మించి శరణార్థి హోదాకు ఎలాంటి గుర్తింపు ఉండదు.. న్యాయపరమైన ఉత్తర్వు ద్వారా శరణార్థి హోదాను ప్రకటించడం సాధ్యం కాదు... సమానత్వ హక్కు విదేశీయులకు, అక్రమ వలసదారులకు అందుబాటులో లేదు’ అని కేంద్రం ఉద్ఘాటించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa