ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ తెలుగుదేశం పార్టీ మూడో జాబితా విడుదల చేసింది. మరో 11 ఎమ్మెల్యే స్థానాలకు,13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే టీడీపీ ప్రకటించిన మూడో లిస్టులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఎంపీ అభ్యర్థిగా తమ పార్టీ తరుఫున బీజేపీ పార్టీ నేతను ప్రకటించడం విశేషం. బాపట్ల లోక్‌సభ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా టి. కృష్ణప్రసాద్‌ను తెలుగుదేశం పార్టీ అధినేత ప్రకటించారు. ఈ మేరకు మూడో జాబితాలో ఆయనకు చోటు కల్పించారు.
కృష్ణప్రసాద్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పనిచేశారు. అనంతరం బీజేపీ పార్టీలో చేరారు. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కృష్ణ ప్రసాద్ బీజేపీ తరుఫున కంటోన్మెంట్ టికెట్ ఆశించారు. కానీ కుదరలేదు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ వరంగల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన భావించారు. అయితే వరంగల్ ఎంపీ టీకెట్ బీజేపీ నుంచి ఆరూరి రమేష్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఊహించని విధంగా బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి కృష్ణప్రసాద్‌ను తమ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది.
అయితే బాపట్ల ఎంపీ టికెట్‌ను ఉండవల్లి శ్రీదేవి ఆశించారు. తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి ఇటీవలే వైసీపీ నుంచి టీడీపిలో చేరారు. బాపట్ల ఎంపీ టికెట్ వస్తుందని ఆశించారు. అయితే ఊహించని విధంగా బాపట్ల ఎంపీ టికెట్‌ను కృష్ణప్రసాద్‌కు టీడీపీ అధిష్టానం కేటాయించింది. అయితే కృష్ణప్రసాద్ ఎంపికపై అటు తెలంగాణ బీజేపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కృష్ణప్రసాద్ ఇప్పటివరూ బీజేపీకి రాజీనామా కూడా చేయలేదని సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధికి టీడీపీ ఎంపీ టికెట్ ఇవ్వటం రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
2024 ఎన్నికల కోసం ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ స్థానాల్లో బరిలోకి దిగుతోంది. బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో పోటీచేయనుంది. ఇక జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే ఇప్పటి వరకూ మూడు జాబితాలుగా అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు. మొత్తంగా 139 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరో ఐదు అసెంబ్లీ, నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.