ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలన్నీ వ్యూహ, ప్రతివ్యూహలు రచించడంలో తలమునకలై ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి, పోల్ మేనేజ్‌మెంట్ వరకూ ప్రతి విషయంలోనూ ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అవతలి పార్టీల అంచనాలకు అందని విధంగా.. వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే వాలంటీర్ల విషయంలో వైసీపీ అధిష్టానం ఓ సూపర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వాలంటీర్ల సేవలను ఎలాగైనా ఉపయోగించుకోవాలని భావిస్తున్న వైఎస్ఆర్‌సీపీ.. ఈ క్రమంలోనే ఓ సరికొత్త వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.
పౌరసేవలను, ప్రభుత్వం అందించే పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారుల ఇళ్లవద్దకే అందించాలనే ఉద్దేశంతో వైసీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమించింది. ఈ రకంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల మందితో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకువచ్చిన వైసీపీ.. వీరికి వాలంటీర్లను అనుసంధానం చేసి ప్రభుత్వసంక్షేమ పథకాలను ఇళ్లవద్దకే అందిస్తోంది. ఆ రకంగా వాలంటీర్లు గ్రామస్థులకు చేరువయ్యారు.
అయితే ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందే వాలంటీర్లను ఎన్నికలకు ఉపయోగిస్తే.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారని విపక్షాల అనుమానం. దీంతో ఎన్నికల సంఘాన్ని, కోర్టును ఆశ్రయించాయి. కోర్టులు, ఈసీ సైతం ఎన్నికల విధుల్లో వాలంటీర్లను ఉపయోగించకూడదంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. పోలింగ్ ఏజెంట్లుగా కూడా నియమించకూడదని స్పష్టం చేశాయి. అయితే ప్రతి ఇంటికి పరిచయమైన వాలంటీర్ల సేవలను ఎలాగైనా ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవాలని భావిస్తున్న వాలంటీర్ యువతతో ముందుగానే రాజీనామా చేయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన తర్వాత వీరిని పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగా ఉపయోగించుకోవాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలిసింది. రాజీనామా చేసిన వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా ఉపయోగించుకునేందుకు టెక్నికల్‌గా ఎలాంటి ఇబ్బంది లేకపోవటంతో ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనిపై విపక్షాలు ఫిర్యాదు చేసేందుకు కూడా అవకాశం ఉండదని భావిస్తున్నట్లు సమాచారం. మరి వైసీపీ ఈ వ్యూహాన్ని విపక్షాలు ఎలా ఎదుర్కొంటాయనేది చూడాలి మరి.