తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలంలో కొనసాగుతోంది. ఆమెకి పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. శనివారం నాడు వెంకటాచలం మండలంలోని పుంజలూరుపాడు గ్రామంలో ఆరణి నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక గుండె పోటుకు గురై నారాయణ రెడ్డి (54) మృతి చెందారు. నారాయణ రెడ్డి కుటుంబసభ్యులను ఆమె ఓదార్చి, ఆర్ధికసాయం అందజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ... చంద్రబాబుని 53 రోజులు అక్రమంగా అరెస్టు చేసి జైలులో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో 203 మంది తెలుగుదేశం కార్యకర్తలు చనిపోవడం తనకు బాధకలిగించిందని అన్నారు. ఒకప్పుడు రాజకీయమంటే హుందాగా గర్వంగా ఉండేదని.. ఇప్పుడు ఏపీని రౌడీ రాజ్యం(వైసీపీని ఉద్దేశించి) పరిపాలిస్తుందని అన్నారు. చంద్రబాబు తన జీవితాన్ని కార్యకర్తలకు అంకితం చేశారని తెలిపారు. లీడర్ ఏవిధంగా ఉంటే కార్యకర్తలు ఆవిధంగా ఉంటారని నారా భువనేశ్వరి తెలిపారు.