ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సరైన నాయకుడు అవసరం అని, ఆ సరైన నాయకుడు చంద్రబాబేనని పేర్కొన్నారు నారా భువనేశ్వరి. శనివారం నాడు నెల్లూరు జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా మహిళలతో భువనేశ్వరి ప్రత్యేకంగా మాట్లాడారు. మహిళలు, రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలపై ఆందోళన వ్యక్తం చేశారు. నారా భువనేశ్వరి కామెంట్స్.. ‘మీలో ఒక మహిళగా మీ బాధల్లో పాలుపంచుకోవడానికి వచ్చాను. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడటం వారికి గౌరవం. నేను హెరిటేజ్ డైరీ భాద్యతలు తీసుకున్న తరువాత కొన్ని తప్పులు చేశాను. తప్పుల్లో నుంచి పాఠాలు నేర్చుకున్నాను. మహిళలు స్వేచ్ఛ కోసం ముందుకెళ్లాలి. కార్మికుల చమటతోనే పుట్టింది తెలుగు దేశం పార్టీ. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడం వల్ల కార్మికులే అధికంగా ఇబ్బంది పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం కల్తీ మద్యం తీసుకొచ్చి పేదల జీవితంతో ఆడుకుంటోంది. లక్షల మంది రోజువారి కార్మికులు గత ఐదేళ్లగా ఉపాధి అవకాశలు లేక కష్టపడుతున్నారు. తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో ఇరవై లక్షల మంది రోజు వారి కూలీలకి ఉపాధి కల్పించింది. ఈ ఇదేళ్ల కాలంలో 13,500 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. త్వరలో మన ప్రభుత్వం వస్తుంది.’ అని అన్నారు.