ఏ సినిమా హీరోకు లేనంత క్రేజ్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఉందని మంత్రి రోజా అన్నారు. ఏపీలోని జనం జగన్‌కు ఎప్పుడు ఓటేద్దామా అని ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఆ విషయం సిద్ధం సభలతోనే తెలిసిపోయిందన్న రోజా.. మంచి చేస్తేనే ఓటేయండని అడిగే దమ్మున్న లీడర్ జగన్ అని రోజా చెప్పారు. మార్చి 27వ తేదీ నుంచి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమవుతుందని రోజా చెప్పారుు. తిరుపతి జిల్లాకు వచ్చేసరిక మేము కూడా సిద్ధం ఉంటామని రోజా చెప్పుకొచ్చారు.
"ఏపీ జనం జగనన్నకు ఎప్పుడు ఓటేద్దామా అని ఎదురు చూస్తున్నారు. సిద్ధం సభలతోనే ఆ విషయం తేలిపోయింది. సామాన్య కార్యకర్తలు స్టార్ క్యాంపెయినర్ల మాదిరిగా నియోజకవర్గాల నుంచి సిద్ధం సభలకు తరలివచ్చారు. తండ్రి వైఎస్ఆర్ పేరు నిలబెట్టేలా జగనన్న పాలన సాగింది. మంచి చేస్తేనే ఓటేయమని అడిగే దమ్మున్న నాయకుడు జగనన్న. దేశంలో ఏ సీఎంకు అంత దమ్ము లేదు. మార్చి 27వ తేదీ ఇడుపులపాయలో వైఎస్ఆర్‌కు నివాళులు అర్పించి బస్సు యాత్ర ప్రారంభిస్తారు. జగనన్నకు స్వాగతం పలికేందుకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం." అని మంత్రి రోజా అన్నారు.
ఏ సినిమా యాక్టర్‌కు లేనంత క్రేజ్ జగనన్నకు ఉంది. ఆయన రియల్ హీరో. ఆయన చేసిన మంచిపనులే ఆయన వెనుక అందరూ నిలబడేలా చేశాయి. అందుకే వైసీపీ మ్యానిఫెస్టో కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. జగనన్న చెప్పారంటే చేస్తారు. కానీ చంద్రబాబు టీమ్ మాత్రం ప్రజలను మోసం చేసి 2014లో అధికారంలోకి వచ్చారు. అప్పుడు జరిగింది జనం మర్చిపోలేరు. వారి మ్యానిఫెస్టోను జనం నమ్మరు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఎన్నో చెప్పి.. ఆ వెంకన్నకే శఠగోపం పెట్టాలని చూస్తున్నారు. ప్రజలే వారికి బుద్ధి చెప్తారు అని రోజా అన్నారు.
"టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా తర్వాత వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. చిలకలూరిపేట మీటింగ్ తర్వాత వైసీపీకి 175కు 175 అని అర్థమైపోయింది. టీడీపీలోని సీనియర్లు సైతం టికెట్ కోసం ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా జెండా మోసిన వాళ్లకి టీడీపీ సీటు ఇవ్వలేదని" రోజా విమర్శించారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ మీద రోజా సెటైర్లు విసిరారు. 24 సీట్లు ఇచ్చినప్పుడేమో గాయత్రి మంత్రంలో కూడా 24 అక్షరాలే ఉంటాయన్న పవన్ కళ్యాణ్.. కాపులకు ఇప్పుడేమి సమాధానం చెప్తారని అన్నారు. 21 సీట్లకు ఏం చెప్పాలో త్రివిక్రమ్ రాసి ఇవ్వలేదేమో అంటూ ఎద్దేవా చేశారు .