కోనసీమ అంబేద్కర్ జిల్లా పి.గన్నవరం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా సరిపెళ్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ పేరును టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ స్థానం టీడీపీ నుంచి జనసేనకు మారింది. జనసేన తరుఫున పవన్ కళ్యాణ్.. పి. గన్నవరం స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు. రెండు నెలల కింద జనసేనలో చేరిన గిడ్డి సత్యనారాయణను పి. గన్నవరం అభ్యర్థిగా ప్రకటించారు. గిడ్డి సత్యనారాయణ హైదరాబాద్‌లో పోలీస్ అధికారిగా పనిచేశారు.
మరోవైపు మహాసేన రాజేష్‌గా ఫేమస్ అయిన సరిపెళ్ల రాజేష్‌కు చంద్రబాబు ఫస్ట్ లిస్టులోనే చోటు కల్పించారు. పి.గన్నవరం నుంచి మహాసేన రాజేష్‌ను పోటీకి నిలబెడుతున్నట్లు ప్రకటించారు. అయితే మహాసేన రాజేష్ గతంలో చేసిన వ్యాఖ్యలు అతనికి ఇబ్బంది కరంగా మారాయి. బ్రాహ్మణులు, హిందువులకు వ్యతిరేకంగా మహాసేన రాజేష్ వ్యాఖ్యలు ఉన్నాయని.. ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ స్థానిక నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. జనసేన నేతలతో పాటుగా టీడీపీలోని కొంతమంది నేతలు కూడా మహాసేన రాజేష్‌కు టికెట్ వద్దని.. అతనికి టికెట్ ఇస్తే మిగతా నియోజకవర్గాలలోనూ ఆ ప్రభావం పడుతుందని అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
నిరసనలు ఎక్కువ కావటంతో మహాసేన రాజేష్ క్షమాపణలు సైతం చెప్పారు. ఆ తర్వాత తన వల్ల ఇబ్బంది కలుగుతుందని అనుకుంటే పోటీ నుంచి తప్పుకుంటానంటూ మహాసేన రాజేష్ ప్రకటించారు. రాజేష్ ప్రకటన వెలువడి 15 రోజులు గడుస్తున్నా కూడా అధిష్టానం వైపు నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవటంతో.. పి.గన్నవరం టికెట్ ఆయనకేనన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఊహించని విధంగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పి. గన్నవరం టికెట్‌ను జనసేనకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో జనసేన తరుఫున గిడ్డి సత్యనారాయణను పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా ప్రకటించారు. ఐవీఆర్ఎస్ సర్వేల ఆధారంగా గిడ్డి సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించారు.
మరోవైపు మహాసేన రాజేష్ 2019 ఎన్నికలప్పుడు రాజేష్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. జగన్‌కు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. ఆ తర్వాత వైసీపీకి దూరమైన రాజేష్.. మహాసేన పేరుతో సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానెళ్లలో వైసీపీ సర్కారు మీద విమర్శలు చేస్తూ మహాసేన రాజేష్‌గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత జనసేనకు సైతం పనిచేశారు. సుమారు ఏడాది కిందట టీడీపీలో చేరిన మహాసేన రాజేష్‌కు చంద్రబాబు తొలి జాబితాలోనే సీటిచ్చారు. కానీ గతంలో చేసిన వ్యాఖ్యల కారణంగా మహాసేన రాజేష్ తన సీటును కోల్పోవాల్సి వచ్చింది.