కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన ఎలక్ర్టానిక్ సిగరెట్లు (ఈ-సిగరెట్) విక్రయిస్తున్న రెండు దుకాణాలపై విశాఖ త్రీ టౌన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. 743 ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకుని, దుకాణాల యజమానులపై కేసులు నమోదుచేసి అరెస్టు చేశారు. నగర పోలీస్ కమిషనరేట్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాయింట్ పోలీస్ కమిషనర్ కె.ఫకీరప్ప ఈ వివరాలను వెల్లడించారు. విశాఖలో గంజాయి వినియోగానికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇటీవల కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు విద్యార్థుల వద్ద ఈ-సిగరెట్‌లు లభ్యమయ్యాయి. వారిని విచారించగా..సిరిపురం కూడలి సమీపంలోని దసపల్లాహిల్స్ వద్ద దేజావు రెడీమేడ్ దుకాణంలో, సర్క్యూట్‌హౌస్ ఎదురుగా ఉన్న మీరా కలెక్షన్స్‌లో కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. దీంతో త్రీ టౌన్ పోలీసుల సహకారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ నెల 18న ఆయా దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. మీరా కలెక్షన్స్‌లో పలు బ్రాండ్‌లకు చెందిన 656 ఈ-సిగరెట్‌లు, దేజావు రెడీమేడ్ క్లాత్ షాప్‌లో మూడు వేర్వేరు బ్రాండ్‌లకు చెందిన 87 ఈ-సిగరెట్‌లు లభ్యమయ్యాయి. ఒక్కోటి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఉంటాయని, సీజ్ చేసిన ఈ-సిగరెట్‌ల విలువ రూ.25 లక్షలు ఉంటుందని జాయింట్ సీపీ కె.ఫకీరప్ప తెలిపారు. ఈ-సిగరెట్‌లో పొగాకు, నికోటిన్‌తోపాటు ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు ఉంటాయన్నారు. వీటిని రీచార్జి చేసుకుని బ్యాటరీ సాయంతో వినియోగిస్తారన్నారు. వీటిని వినియోగించే వారితోపాటు ఈ-సిగరెట్ నుంచి వదిలే పొగను పీల్చేవారికి కూడా ఊపిరితిత్తులు వేగంగా దెబ్బతిని కాన్సర్‌కు దారితీస్తాయని తెలిపారు.