ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు దాదాపు ఖరారవ్వడంతో టికెట్ ఆశించి భంగపడ్డవారు అసంతృప్తికి లోనవుతున్నారు. అన్ని పార్టీల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఏలూరు ఎంపీ టికెట్ దక్కకపోవడంతో టీడీపీ నేత గొర్రుముచ్చు గోపాల్ యాదవ్ కూడా అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిపై ఆయన పలు ఆరోపణలు చేశారు. ‘‘ గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లేది నేనే. అది ఇండిపెండెంట్ గానా, వేరే పార్టీలోనా అనేది త్వరలో చెబుతా. యనమల రామకృష్ణుడి వల్ల టీడీపీకి బీసీలు దూరమవుతున్నారు. నాకు టికెట్ దక్కకపోవడానికి కారణం యనమల రామకృష్ణుడే’’ అని గొర్రుముచ్చు గోపాల్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏలూరు ఎంపీ ఓసి టికెట్‌ను బీసీగా మార్చిన ఘనత తనదేనని గొర్రుముచ్చు గోపాల్ యాదవ్ అన్నారు. ఐవీఆర్ఎస్ సర్వేలో తాను ముందున్నా టికెట్ రాకుండా యనమల రామకృష్ణుడు అడ్డుపడ్డారని ఆరోపించారు. పార్టీకి ఏ సేవ చేశాడని మహేశ్ యాదవ్‌కు టికెట్ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.