ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి రైతుల సంచలన నిర్ణయం.. ఉద్యమానికి విరామం, కారణం ఇదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2024, 08:12 PM

అమరావతిలో రైతులకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. రాజధాని అమరావతి ఉద్యమానికి ఎన్నికల సంఘం ఆదేశాలు, పోలీసుల సూచన మేరకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్టు సమన్వయ కమిటీ, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తెలిపింది. అమరావతి ఉద్యమకారులకు, మహిళలకు, రైతులకు, రైతు కూలీలకు, దళిత, మైనారిటీ జేఏసీ సభ్యులకు, లీగల్ అండ్ ఫైనాన్స్ కమిటీ సభ్యులకు, శిబిర నిర్వాహకులకు ఈ మేరకు ఐక్య కార్యాచరణ సమితి నుంచి ఆదేశాలు అందాయి. 1560 రోజులుగా ఎన్ని అవాంతరాలు, అణచివేతలు ఎదురైనా అప్రతిహతంగా అమరావతి ఉద్యమం కొనసాగింది అన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలు, పోలీసు సూచనల మేరకు బహిరంగ సమిష్టి నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించామన్నారు జేఏసీ నేతలు.


ఉద్యమకారులు కరోనా లాక్ డౌన్ సమయంలో నిరసన కార్యక్రమాలు కొనసాగించారు.. ఇప్పుడు కూడా అదే విధంగా తమ తమ ఇళ్ల దగ్గరే నిరసన కార్యక్రమాలు చేపట్టాలని జేఏసీ విజ్జప్తి చేసింది. తదుపరి కార్యాచరణను పరిస్థితులకు అనుగుణంగా ప్రకటిస్తామని తెలిపింది. రోజులు.. వారాలు.. నెలలు.. సంవత్సరాలు గడిచిపోయానని.. కానీ అన్యాయంపై అమరావతి అన్నదాతలు సాగిస్తున్న సమరం అజరామరంగా సాగుతూనే ఉంది అన్నారు. కరోనాలు, లాక్‌డౌన్‌లు, తుఫానులు, పోలీసుల కేసులు, అరెస్టులు, మాటలు ఇలా ఎన్ని ఆటంకాలు వచ్చినా అమరావతి రైతులు పోరాటం కొనసాగిస్తున్నారు. 1560 రోజులుగా రాజధాని రైతులు, కూలీలు అమరావతి కోసం పోరాడుతూనే ఉన్నారు.


ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారు. అప్పటి నుంచి రాజధాని గ్రామాల్లో రైతుల నిరసనలు ప్రారంభమయ్యాయి. 2020 డిసెంబరు 25 నుంచి కరోనా లాక్‌డౌన్‌ ప్రారంభమైన తర్వాత ఇళ్ల దగ్గర నుంచి రైతులు తమ నిరసనను కొనసాగించారు. 2021 అక్టోబరు వరకు ఉద్యమం కొనసాగుతుండగానే.. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో నేలపాడు నుంచి తిరుపతి వరకు పాదయాత్ర నిర్వహించారు. రెండోసారి అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు నిర్వహించిన పాదయాత్రకు అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా సరే జేఏసీ నేతలు వరకే పరిమితంగా అరసవల్లికి పాదయాత్ర పూర్తి చేశారు. ఆ తర్వాత కూడా అమరావతి ఉద్యమం కొనసాగుతోంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తాత్కాలికంగా విరామం అని.. అలాగని ఉద్యమాన్ని ఆపడం లేదన్నారు. రైతులు, మహిళలు, రైతు కూలీలు, మైనార్టీలు, దళితులు ఇలా ప్రతి ఒక్కరూ వారి, వారి ఇళ్లలోనే తమ నిరసనలు కొనసాగిస్తారని అమరావతి జేఏసీ నేతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa