జగన్ ప్రభుత్వాన్ని గద్దెం దింపేందుకే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి ఫురందేశ్వరి తెలిపారు. విజయవాడలో బీజేపీ పదాదికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జి అరుణ్ సింగ్, ఇన్ఛార్జి సిద్ధార్ధనాధ్ సింగ్ పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఫురందేశ్వరి దిశానిర్ధేశం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని జాతీయ స్థాయిలో పార్టీ తీసుకున్న నిర్ణయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరమని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును ఆమె త్రివేణి సంగమంతో పోల్చారు. పొత్తుల వల్ల పార్టీలో చాలా మంది ఆశావహులకు నిరాశ ఎదురైంది. కానీ రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులతో వెళ్లాలని పార్టీ హైకమాండ్ భావించిందన్నారు.