ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో మరో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చింది. నడికుడి- శ్రీకాళహస్తి నూతన రైలు మార్గం ప్రాజెక్టులో భాగంగా గుండ్లకమ్మ– దర్శి మధ్య 27 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చింది. రైల్వే లైన్ నిర్మాణాన్ని పూర్తి చేసి రైళ్ల రాకపోకలు ప్రారంభించినట్లు గుంటూరు రైల్వే డీఆర్ఎం రామకృష్ణ వెల్లడించారు. విద్యుద్దీకరణ పనులు కూడా పూర్తయ్యాయని.. ఈ మార్గంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడపడానికి అనుమతి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఏపీలో చేపట్టిన ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులలో నడికుడి- శ్రీకాళహస్తి ప్రాజెక్టు ఒకటని రైల్వే అధికారులు తెలిపారు.
మరోవైపు నడికుడి- శ్రీకాళహస్తి ప్రాజెక్టు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని అనేక ప్రాంతాలను అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాజెక్టు 2011-12లో మంజూరు కాగా..రూ. 2,289 కోట్ల అంచనా వ్యయంతో 309 కి.మీ.ల రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం, రైల్వే శాఖ సగం సగం చొప్పున ఖర్చు భరించనున్నాయి. ప్రాజెక్టు కోసం అవసరమైన భూమిని ఏపీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. మొత్తం ఐదు దశల్లో ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ఈ లైన్ వెంట మొత్తం 38 స్టేషన్లు నిర్మించనున్నారు. పనుల్లో జాప్యం, వాయిదాల కారణంగా అంచనా మొత్తం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా తొలుత నడికుడి నుంచి పల్నాడు జిల్లా శావల్యాపురం వరకు పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. రెండో దశలో దర్శి వరకు రైల్వే లైన్ నిర్మించారు. దర్శి సమీపంలోని అద్దంకి రోడ్డు వద్ద స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు.