‘జగన్మోహన్‌రెడ్డి నా అన్న.. నా రక్తం.. అన్నంటే నాకు ద్వేషం లేదు. ఎన్నికల్లో నన్ను చెల్లి కాదు బిడ్డ అన్నాడు.. ముఖ్యమంత్రి అయ్యాక మనిషి మారిపోయాడు.. ముఖ్యమంత్రి జగన్ ఎవరో నాకు పరిచయం లేడు. ఈ సీఎం నా అనుకున్న వాళ్లందరినీ నాశనం చేశాడు..’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి దుయ్యబట్టారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడని.. చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన వాళ్లకే కడప ఎంపీ టికెట్ ఇచ్చాడని.. ఇది తట్టుకోలేకపోయానని తెలిపారు. ‘హత్య చేసిన వాళ్లను, చేయించిన వాళ్లను తప్పిస్తున్నారు. ఎంపీని వెనకేసుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. వివేకా హత్యను రాజకీయానికి వాడుకున్నారు. సొంత చిన్నాన్నకే న్యాయం జరగలేదంటే ప్రజలకు ఏం జరుగుతుంది? చిన్నాన్న కోరిక మేరకు కడప ఎంపీగా పోటీ చేస్తున్నా’ అని ప్రకటించారు. మంగళవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో తల్లి వైఎస్ విజయలక్ష్మి, కూతురు అంజలి, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, జేడీ శీలం, మీడియా చైర్మన్ తులసిరెడ్డితో కలిసి వైఎ్‌సకు నివాళులు అర్పించి ప్రార్థనలు చేశారు. 114 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, ఐదు ఎంపీ అభ్యర్థులతో కూడిన కాంగ్రెస్ తొలి జాబితాను ఘాట్‌పై ఉంచారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ హంతకులను ఈ ఐదేళ్లూ వెనకేసుకొచ్చారని ఆక్షేపించారు. ఘోరమని తెలిసినా.. ప్రజలు హర్షించరని తెలిసినా.. ఎంత అహంకారం కాకపోతే మళ్లీ అదే అవినాశ్‌రెడ్డికి ఇస్తారని నిలదీశారు. ‘రాజకీయ లబ్ధి కోసం వివేకాను హత్య చేస్తే అదే హంతకులకు జగనన్న అండగా నిలబడ్డాడు. మరి రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా నేను ఏం చేయాలి? ఆయన తమ్ముడికే న్యాయం చేయలేకపోతే ఇక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి బిడ్డ సునీత న్యాయం కోసం ఈరోజు కోర్టులు, గడపగడపా తిరుగుతోంది. అసలు కనికరం లేదా? వారినే హంతకులు అంటున్నారే.. హృదయం లేదా? ఈరోజు నేను ఎంపీగా నిలబడడానికి కారణం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అవినాశ్‌ను నిలబెట్టారు కాబట్టి.. ఇది హత్యా రాజకీయం కాబట్టి.. ఒక హంతకుడు, హత్య చేయించిన వాళ్లు చట్టసభల్లోకి వెళ్లకూడదనే నేను పోటీచేస్తున్నా’ అని స్పష్టం చేశారు.