పిఠాపురం తన స్వస్థలమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఒకసారి వచ్చి వెళ్లిపోవడానికి ఇక్కడికి రాలేదని... తాను ఎక్కడికీ వెళ్లనని ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ పర్యటన నాలుగోరోజైన మంగళవారం కొనసాగింది. యు.కొత్తపల్లి మండలంలో పార్టీ వీరమహిళలతో ఆయన సమావేశం నిర్వహించారు. కాసేపట్లో పవన్ ప్రసంగం మొదలవుతుందనగా నియోజకవర్గ ఎన్నికల అధికారులు వచ్చి సమావేశానికి అనుమతులు లేవని అభ్యంతరం తెలిపారు. దీంతో పవన్ ఈ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. అనంతరం మహిళలనుద్దేశించి కాసేపు ప్రసంగించారు. పార్టీ వీరమహిళలతో ఎంతో ప్రేమ, బాధలు పంచుకోవాలని ఉందని, ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకోవాలని ఉందని పవన్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి 48 గంటల ముందే దరఖాస్తు చేసుకున్నా అనుమతి రాలేదన్నారు. మరో రెండు మూడు రోజుల్లో అన్ని అనుమతులూ తీసుకుని ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేసుకుందామని చెప్పారు. అధికారులు అనుమతులు ఎందుకు ఇవ్వలేదో కారణాలు తెలుసుకుంటానని తెలిపారు. ‘‘మీకు ఒక్కటే చెబుతున్నా.. మీ సోదరుడిగా.. బిడ్డగా.. కుటుంబ సభ్యుడిగా.. పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకుంటా. నేను ఎక్కడికీ వెళ్లను. ఒక్కసారి వచ్చి వెళ్లిపోవడానికి పిఠాపురం రాలేదు. ఇక్కడ ప్రతిఒక్కరికీ అండగా ఉంటా’’ అని చెప్పారు.