తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ఓ పూట కూరకు సాయం చేసిన ఎమ్మెల్యే.. అంతమాత్రానికే దానకర్ణుడిలా గొప్పలు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కరోనా సమయంలో ఓ రోజు స్థానికంగా ఉండేవారికి చికెన్, టమాటాలు పంపిణీ చేశారు.
ఈ విషయాన్ని ఎన్నికల సీజన్ మొదలైనప్పటి నుంచి ఎమ్మెల్యే తన ప్రచారానికి వాడుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పుడు సాయం స్వీకరించిన స్థానికులు దీన్ని అవమానకరంగా భావిస్తున్నామన్నారు. ఈ క్రమంలో మంగళవారం శ్రీకాళహస్తిలోని కుమారస్వామితిప్ప కూడలి దగ్గర నిరసన చేపట్టారు. ఒక్క రోజు సాయం చేసి.. రాజకీయ వేదికలపై తమ ఆత్మగౌరవం దెబ్బతీసేలా రోజూ చెప్పుకోవడం సరికాదన్నారు.
గతంలో లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమై పనుల్లేక పస్తులుంటున్నవారికి మధుసూదన్ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి బియ్యం, పప్పులు, కూరగాయలు అందజేశారని ముస్లింలు పేర్కొన్నారు. కష్టకాలంలో సహాయం చేసి ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో గొప్పలు చెప్పుకోవడం తగదన్నారు. లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు పేదలకు తనవంతుగా సాయం చేస్తానని ఎమ్మెల్యే చెప్పి ఇప్పుడు ప్రచారంలో తమ మనోభావాలను దెబ్బతీసేలా చేయడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఐదేళ్లలో ఒక్కసారి చికెన్ ఇవ్వడం తప్పా.. ఎమ్మెల్యే చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. అయినా.. ఆపద వచ్చినప్పుడు సాయం చేయడం ఎమ్మెల్యే బాధ్యత కాదా అని ప్రశ్నించారు. తమ వెంట తెచ్చుకున్న మాంసం, టమాటాలు, కోడిగుడ్లు చెత్తకుప్పల్లో పడేశారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే స్పందించాల్సి ఉంది.