ఏపీలో పింఛన్ల పంపిణీ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మార్చి 30న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిల్‌ను హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది.. ఈసీ చర్యల్ని సమర్థించింది. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే నడచుకోవాల్సి ఉంటుందని సూచించింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛను పంపిణీ జరుగుతుందని, అందువల్ల ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరుతూ గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన వి.వరలక్ష్మి, మరో ఇద్దరు పింఛన్‌దారులు ఈ పిల్ దాఖలు చేశారు. వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్ అందించేవారని.. తాజా ఉత్తర్వుల వల్ల వృద్ధులు, దివ్యాంగులు సచివాలయాలకు వెళ్లి పింఛను తీసుకోవడం కష్టంగా మారిందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయాల్లో ఈరోజు నుంచి పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. నేటి నుంచి ఆరవ తేదీ వరకు పెన్షన్‌లు ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పెన్షన్లు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో పెన్షన్లు ఇస్తారని తెలిసిన వృద్ధులు, వితంతువులు ఉదయం నుంచే అనేక ప్రాంతాల్లోని సచివాలయాలకు తరలివచ్చారు.
పెన్షన్ల పంపిణీపై గత కొద్దిరోజులుగా నెలకొన్న గందరగోళ పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి, వితంతువులకు ఇంటివద్దే పింఛను సొమ్ము ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామ సచివాలయాలకు దూరంగా ఉన్న గిరిజనుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది సిబ్బంది ఉన్నారని, సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవడంతో లబ్ధిదారులనే గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చి పింఛను తీసుకునే విధానం ఖరారు చేసినట్టు పేర్కొంది. ఏప్రిల్, మే ఈ రెండు నెలలు ఇదే విధానం అమలవుతుందని తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పనిచేస్తాయని, పింఛన్ల పంపిణీ బుధవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది.
ఈసీ పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశించింది. వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించవద్దని సీఈవోను ఈసీఐ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోడ్ ముగిసేవరకు వాలంటీర్ల ట్యాబ్, మెుబైల్‌ను కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. నగదు పంపిణీ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోవాలని సూచించింది. నగదు పంపిణీలో వాలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని హైకోర్టులో సీఎఫ్‌డీ వేసిన పిటిషన్‌తో పాటు ఆ సంస్థ ఫిర్యాదును కూడా పరిగణనలోకి తీసుకున్నామని ఈసీ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఈసీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది.