ఏపీ ఎన్నికల వేళ అధికార వైసీపీకి.. మరో షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. శ్రీకాకుళం నుంచి గతంలో ఎంపీగా పనిచేసిన కిల్లి కృపారాణి.. 2024 ఎన్నికల్లో టెక్కలి నుంచి వైసీపీ తరుపున అసెంబ్లీకి పోటీ చేయాలని భావించినట్లు సమాచారం. అలా కుదరని పరిస్థితుల్లో శ్రీకాకుళం ఎంపీ సీటైనా దక్కుతుందని ఆశించారు. అయితే వైసీపీ అధిష్టానం.. కిల్లి కృపారాణిని ఏ టికెట్ కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు.
ఇక వైఎస్సార్‌సీపీలో తనకు అన్యాయం, అవమానం జరిగిందని కిల్లి కృపారాణి ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా ఎందుకు నియమించారో.. ఎందుకు తొలగించారో కూడా తెలియని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో చేరిన సమయంలో తనకు కేబినెట్ స్థాయి పదవి, ఎంపీ టికెట్ ఇస్తారని హామీ ఇచ్చారని.. అయితే అవేవీ ఇక్కకుండా మోసం చేశారని కిల్లి కృపారాణి చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో తనకు పదవుల కంటే గౌరవమే ముఖ్యమని.. అందుకే వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు.
మరోవైపు కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరి శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో చేరినా టికెట్ కేటాయింపులు పూర్తైన నేపథ్యంలో.. తిరిగి సొంతగూటివైపు కేంద్ర మాజీ మంత్రి చూస్తున్నట్లు తెలిసింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు కిల్లి కృపారాణి. ఆ తర్వాత కేంద్ర మంత్రి వర్గంలో సహాయమంత్రిగా పనిచేశారు. 2014 లో రాష్ట్ర విభజన జరిగింది. ఆ తర్వాత 2019లో వైసీపీలో చేరారు కిల్లి కృపారాణి. ఇప్పుడు మళ్లీ సొంతగూటికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.