వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం శివాలయం, అయ్యప్పస్వామి దేవాలయాల్లో వెండి వస్తువులు, హుండీలో నగదు చోరీ అయ్యాయి. ఆలయ ధర్మకర్త కొంచాడ ధర్మరావు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పురోహితులు వేకువజామున ఆలయానికి వచ్చి చూడగా గర్భగుడిలో తలుపులు తీసి ఉన్నాయి. దీంతో చోరీ జరిగినట్టు గుర్తించి ధర్మకర్తకు సమాచారం అందజేశారు. గ్రామపెద్దలు కూడా ఆలయం వద్దకు చేరుకున్నారు. హుండీలు, సీసీ కెమెరాలు ధ్వంసమై కనిపించాయి. శివాలయంలో వెండి నాగాభరణం, ధారాపాత్ర, మూడు శఠగోపాలు, వెండి పళ్లెం, రెండు దీపపు కుందులు చోరీకి గురయ్యాయి. అయ్యప్పస్వామి ఆలయంలో ఉద్ధరని, పంచపాత్ర, శఠగోపంతోపాటు ఆరున్నర కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్టు గుర్తించారు. మంగళవారం అర్ధరాత్రి ఆలయాల వెనుక భాగంలో ప్రహరీ పైనుంచి దుండగులు లోపలికి ప్రవేశించి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. దొంగలు ఆలయాల్లో ఉన్న సీసీ టీవీ పుటేజ్‌కు సంబంధించిన డీవీఆర్‌లు కత్తిరించి తీసుకెళ్లినట్టు గుర్తించారు. రెండు ఆలయాల్లో సామగ్రితోపాటు మొత్తంగా రూ.11లక్షల వరకు దొంగిలించారని స్థానికులు పేర్కొంటున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని కాశీబుగ్గ రూరల్ సీఐ ఈశ్వరరావు, ఎస్‌ఐ రామారావు సందర్శించి వివరాలు సేకరించారు. శ్రీకాకుళం నుంచి ఎస్‌ఐ భరత్ ఆధ్వర్యంలో క్లూస్‌టీం సిబ్బంది వచ్చి తనిఖీలు చేశారు. కానీ, ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఆలయం వెనుకభాగంలో రక్తపు మరకలు కూడా ఉండడంతో వాటి నమూనాలు కూడా సేకరించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రామారావు తెలిపారు. దొంగల కోసం గాలిస్తున్నామన్నారు.