జర్మనీ అంతగా ముచ్చటపడితే 20 వేల ఏనుగులను బహుమతిగా పంపుతామని బోట్సువానా అధ్యక్షుడు మోగ్వితీసీ మసిసి హెచ్చరించారు. హంటింగ్ ట్రోఫీల దిగుమతులపై కఠిన ఆంక్షలను విధించే అంశాన్ని జర్మనీ ఈ ఏడాది ఆరంభంలో ప్రతిపాదించింది. వేటను తగ్గించి, వన్యప్రాణులను రక్షించేందుకు ఈ చర్యలు చేపట్టింది. జర్మనీ నిర్ణయంపై బోట్సువానా అధ్యక్షుడు పై విధంగా స్పందించారు. ఈ చర్య తమ దేశాన్ని మరింత పేదరికంలోకి నెడుతుందని, దేశంలో ఏనుగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడానికి కారణమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గజరాజుల సంతతిని అదుపులో ఉంచడానికి వేట తప్పనిసరి అని మసీసీ అన్నారు. అవి జనావాసాల్లోకి పంటలను ధ్వంసం చేయడం, ఇళ్లను కూల్చివేయడం చేస్తున్నాయని ఆయన తెలిపారు.
ఈ నిర్ణయం తన ప్రజలను మరింత కష్టాలకు గురి చేస్తుందని మసిసి జర్మన్ మీడియాను హెచ్చరించారు. వన్యప్రాణి పరిరక్షణ కార్యక్రమాల ఫలితంగా ఏనుగుల సంఖ్య పెరిగిందని, వాటిని అదుపులో ఉంచేందుకు వేట దోహదపడిందని ఆయన అన్నారు. ‘బోట్సువానా సమస్యల గురించి బెర్లిన్‌లో కూర్చొని చెప్పడం చాలా తేలిక.. ప్రపంచం కోసం ఆ జంతువులను కాపాడి మేం భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం.. మాకు చెప్పినట్లే మీరు (జర్మన్లు) కూడా జంతువులతో కలిసి జీవించండి.. ఇది జోక్ కాదు’ అని జర్మనీపై విరుచుకుపడ్డారు.
ప్రపంచంలోని మొత్తం ఏనుగుల సంతతిలో మూడో వంతు బోట్సువానాలో ఉన్నాయి. 1,30,000 ఏనుగులు ఆ దేశంలో ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, 2014లో వీటి వేటను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. కానీ, స్థానికుల ఒత్తిడితో 2019లో ఎత్తివేసింది. ఇప్పుడు వార్షిక వేట కోటాను ప్రభుత్వం నిర్ణయించి అనుమతులు జారీ చేస్తోంది. స్థానికులకు అది ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇప్పటికే అంగోలాకు 8,000, మోజాంబిక్‌కు 5,000 ఏనుగులను ఇచ్చింది.
ఈ ఏడాది మార్చిలో 10,000 ఏనుగులను పంపిస్తామని బ్రిటన్‌కు బోట్సువానా అటవీశాఖ మంత్రి దుమెజ్వేని మ్తింఖులు హెచ్చరించారు. లండన్ హైడ్ పార్క్‌లో వాటితో పాటు బ్రిటిష్ పౌరులు కలిసి జీవించవచ్చని అన్నారు.
హంటింగ్ ట్రోఫీలను నిషేధిస్తూ తీసుకొచ్చిన బిల్లుకు మద్దతుగా యూకే పార్లమెంట్‌లో సభ్యులు మార్చిలో ఓటేశారు. అయితే, చట్టంగా మారడానికి ముందు తదుపరి పరిశీలనకు వెళ్లాల్సి ఉంటుంది. కన్జర్వేటవ్ పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో హంటింగ్ ట్రోఫీలను నిషేధిస్తామని హామీ ఇచ్చింది. తాజాగా, జర్మనీకి కూడా అలాంటి గిఫ్టే ఇస్తామని ఆ దేశాధ్యక్షుడు పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్‌లో హంటింగ్ ట్రోఫీలను అత్యధికంగా ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటున్న దేశం జర్మనీ కాగా.. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బెల్జియం దేశాలు వీటిపై పూర్తిగా నిషేధం విధించాయి. మరోవైపు, మసిసి వ్యాఖ్యలపై జర్మనీ ప్రతినిధి స్పందిస్తూ.. బోట్సువానా తమ వద్ద ఎలాంటి ఆందోళనా వ్యక్తం చేయలేదని తెలిపారు. బోట్సువానా, ఇతర దక్షిణాఫ్రికా దేశాలు సంపన్న పాశ్చాత్యుల నుంచి మంచి లాభాలను ఆర్జిస్తున్నాయి. వేట అనుమతి కోసం వేల డాలర్లు చెల్లించి, వాటి తల లేదా చర్మాలను దిగుమతి చేసుకుంటున్నారు.