విశాఖ నగరం, పరిసర మండలాలు శుక్రవారం ఎండకు మండిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎండ కొనసాగింది. పలుచోట్ల తీవ్ర వడగాడ్పులు, మరికొన్నిచోట్ల గాడ్పులు వీచాయి. ద్విచక్ర వాహనాలపై తిరిగే వారంతా ముఖాలకు రుమాళ్లు కట్టుకుని ప్రయాణించాల్సి వచ్చింది. జిల్లాలో పలుచోట్ల 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పద్మనాభంలో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే భీమిలిలో 43, ఆనందపురంలో 41.9, పెందుర్తి, గాజువాకల్లో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శని, ఆదివారాలు కూడా జిల్లాలో పలుచోట్ల వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.