నేటి నుంచి 10 వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఐదు రోజుల పాటు క్రోధి నామ ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉగాది సమీపిస్తుండటంతో అమ్మవారిని ఆడపడుచుగా భావించే కన్నడ భక్తులు ఎండను సైతం లెక్కచేయకుండా పాదయాత్రగా శ్రీశైలానికి తరలివస్తున్నారు. వందల కిలొమీటర్ల పాదయాత్ర చేస్తూ నల్లమల అటవీ ప్రాంతం నుంచి వేలాదిగా కన్నడ భక్తులు క్షేత్రానికి చేరుకుంటున్నారు. దీంతో నల్లమల అటవీ ప్రాంతం శివనమస్మరణతో మారుమోగుతోంది. కన్నడిగుల రాకతో శ్రీశైలంలో భక్తులు రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఉగాది ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ ప్రాంగణంలో చలువపందిళ్లు, తాగు నీటి వసతి, శౌచాలయాలు, విద్యుత్ దీపాలు, వైద్యశిబిరాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.