500 ఏళ్ల నాటి వివాదం ముగిసిపోయి.. ఇటీవలె అయోధ్యలో దివ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరుపుకుంది. అప్పటి నుంచి నిత్యం దేశవ్యాప్తంగా భక్తులు అయోధ్యకు పోటెత్తుతున్నారు. లక్షల సంఖ్యలో వస్తున్న భక్తులను కంట్రోల్ చేయలేక అయోధ్య రామ మందిరం వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఎన్నో అవస్థలు పడ్డారు. ఈ క్రమంలోనే తిరుపతిలో భక్తుల రద్దీని ఎలా నియంత్రిస్తారో టీటీడీ అధికారుల నుంచి అయోధ్య ఆలయ అధికారులు సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఇక అయోధ్యలో బాలరాముడు కొలువైన తర్వాత తొలిసారి శ్రీరామనవమి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తోంది.
500 ఏళ్ల తర్వాత అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా జయంతి వేడుకలు జరగనున్న నేపథ్యంలో.. అయోధ్యలో రామజన్మోత్సవం శోభ సంతరించుకుంది. అయోధ్యలో వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. మంగళవారం నుంచి అయోధ్య రామ నవమి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రామ్‌నగరిలోని 8 వేల మఠాలు, దేవాలయాలలో అభినందన పాటలు, వివిధ ఆచారాలు ప్రారంభం కానున్నాయి. ఇక రామ్ జన్మోత్సవ్ శుభ సమయంలో.. రామ్ లల్లాను చైత్ర ప్రతిపాద నుంచి రామ నవమి వరకు ఖాదీతో చేసిన ప్రత్యేక దుస్తులతో అలంకరించనున్నారు.
ఇక ఈ ప్రత్యేక ఖాదీ దుస్తులను రామ్ లల్లా కోసం ప్రముఖ డిజైనర్ మనీష్ త్రిపాఠి తయారు చేశారు. ప్రత్యేక ఖాదీ కాటన్‌తో బాలరాముడి దుస్తులు తయారు చేసినట్లు తెలిపారు. ఆ దుస్తులపై చేతితో బంగారం, వెండి ముద్రించినట్లు పేర్కొన్నారు. ప్రింటింగ్‌లో ఉపయోగించే అన్ని చిహ్నాలు వైష్ణవ వ్యవస్థకు చెందినవని వెల్లడించారు. నవరాత్రుల్లో భాగంగా బాలరాముడు రోజుకో రకమైన వస్త్రాలు ధరించనున్నారని.. దానికోసం వివిధ రంగుల దుస్తులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా అయోధ్యకు భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం చైత్ర అమావాస్య సందర్భంగా లక్ష మంది భక్తులు సరయూ నదిలో స్నానాలు చేసి నాగేశ్వరనాథ్ మహాదేవుడిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు పీపుల్ చెట్టుకు పూజలు చేసి తమ భర్తలు ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రదక్షిణలు చేశారు. అనంతరం బాలరాముడు, హనుమాన్‌గర్హి ఆలయాలను సందర్శించారు.
ప్రస్తుతం వేసవి సందర్భంగా ఎండలు మండుతుండడంతో భక్తుల కోసం శ్రీరామ జన్మభూమి మార్గంలో 600 మీటర్ల దూరంలో జర్మన్ హ్యాంగర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రామ జన్మభూమి బాట నుంచి కాంప్లెక్స్ వరకు జూట్ కార్పెట్ వేస్తున్నారు. ఆలయంలో దాదాపు 50 కి పైగా చోట్ల తాగునీరు, ఓఆర్‌ఎస్ పౌడర్‌ను అందిస్తున్నారు. రామ నవమి సందర్భంగా లక్షలాది మంది భక్తులు వస్తారని.. అయితే రాని వారి కోసం ప్రసార భారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని ఆలయ అధికారులు వెల్లడించారు. అయోధ్య నగరంలో వందకు పైగా ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక లైవ్ టెలికాస్ట్ ద్వారా భక్తులు రామ్ లల్లా జన్మదినాన్ని ఇంట్లో నుంచే చూడవచ్చని తెలిపారు.
ఈనెల 17 వ తేదీన రామజన్మోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజున హెలికాప్టర్ల ద్వారా అయోధ్య ఆలయం అంతటా పూలవర్షం కురిపించనున్నారు. రామ మందిర సముదాయాన్ని ఆంథోనియం, నిలయం, కార్నేషన్, ఆర్కిడ్, జార్వెరా, బంతి పువ్వు, గులాబి, బెల్లా తదితర విదేశీ జాతుల పూలతో అద్భుతంగా అలంకరించనున్నారు. 9 రోజుల పాటు అయోధ్య ఆస్థానంలో శాస్త్రీయ గాయకులు సోహార్, అభినందన గీతాలు, భజనలు పఠించనున్నారు. రామాలయాన్ని 50 క్వింటాళ్ల పూలతో అలంకరించనున్నారు. ఇక శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని హోటళ్లు, ధర్మశాలల్లో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. హోమ్ స్టేలో కూడా ఏప్రిల్ 20 వ తేదీ వరకు బుకింగ్‌లు పూర్తయ్యాయని నిర్వాహకులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa