రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎ 400 సీట్లకు పైగా విజయం సాధిస్తుందని అసోమ్ గణ పరిషత్ (ఎజిపి) అధ్యక్షుడు మరియు అస్సాం మంత్రి అతుల్ బోరా శుక్రవారం విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పై ఏజీపీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ హయాంలో నేతలు అవినీతికి పాల్పడ్డారని.. మరోవైపు 2014లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్‌డీఏ అధికారంలోకి రాగానే ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. ప్రధాని మోదీని ప్రజలు విశ్వసించారు. ప్రధాని మోదీ తన హామీలన్నీ నెరవేర్చారు అని తెలిపారు. ఏప్రిల్ 17న బార్‌పేట లోక్‌సభ స్థానం పరిధిలోని నల్బరీలో జరిగే మెగా ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. అస్సాంలోని 14 లోక్‌సభ నియోజకవర్గాలకు మూడు దశల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.