విశాఖపట్టణంలో వైసీపీ అఘాయిత్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. జీవీఎంసీ 65వ డివిజన్ నివాసి జలుమూరి రాధపై అదే వార్డు మొదలవలస లోకనాథం పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేయడం చాలా దారుణమన్నారు. జగన్‌రెడ్డి పాలనలో సొంత తల్లి వైయస్ విజయమ్మకు, చెల్లి వైయస్ షర్మిలకే రక్షణ లేదని చెప్పారు. అలాంటిది.. రాధలాంటి సామాన్య మహిళలకు ఇంకెక్కడ రక్షణ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఇంటి పట్టాకు లంచం ఎందుకు ఇవ్వాలని నిలదీసిన రాధను సదరు వైసీపీ నేత సజీవదహనం చేయాలనుకోవడం.. రాష్ట్రంలో జగన్ పార్టీ చేస్తున్న అరాచకాలకు అద్దంపడుతోందన్నారు.ఈ ఘటనలో నిందితుడైన లోకనాథంతోపాటు అతడికి సహకరించిన వైసీపీ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. అయితే కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందున్న బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని.. ఆమె ప్రాణాలు కాపాడాలని వైద్యులకు నారా లోకేశ్ విజ్జప్తి చేశారు.విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో రాధకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆ క్రమంలో ఇంటి పట్టా పొందేందుకు ఆమెను స్థానిక వైసీపీ నాయకుడు లోకనాథం నగదు డిమాండ్ చేశారని సమాచారం. ఆ క్రమంలో నగదు ఎందుకు ఇవ్వాలంటూ లోకనాథాన్ని రాధా నిలదీసింది. దీంతో ఆగ్రహించిన లోకనాథంతోపాటు అతడి అనుచరులు.. రాధపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే స్పందించి.. బాధితురాలు రాధాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.