బోర్న్‌వీటా. దీన్ని పాలల్లో కలుపుకుని చాలా మంది తాగుతారు. ఇక చిన్నపిల్లలకు అయితే ఈ బోర్న్‌వీటాను రోజూ తాగిస్తూ ఉంటారు. బలం వస్తుందని.. బాగా పెరుగుతారని కూడా చెబుతూ ఉంటారు. వీటికి తగ్గట్టే బోర్న్‌వీటా అడ్వర్టైజ్‌మెంట్‌లు కూడా అలాగే ఉంటాయి. స్పోర్ట్స్ స్టార్లతో ప్రచారం చేయిస్తూ.. వారి స్టామినాకు రహస్యం ఈ బోర్న్‌వీటా అంటూ తెగ యాడ్లు వాయించేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బోర్న్‌వీటాకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. అసలు బోర్న్‌వీటా హెల్త్ డ్రింక్ కానే కాదని తేల్చింది. వెంటనే హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి బోర్న్‌వీటాను తీసేయాలని సంచలన ఆదేశాలు వెలువరించింది.
బోర్న్‌విటాను హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి తీసేయాలని అన్ని ఈ-కామర్స్ సంస్థలకు తమ ప్లాట్‌ఫారమ్‌లలోని హెల్త్ డ్రింక్స్ సెక్షన్‌లో ఈ బోర్న్‌వీటాను తొలగించాలని సూచించింది. ఈ ఆదేశాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే బోర్న్‌విటా మాత్రమే కాకుండా అన్ని రకాల డ్రింక్స్‌ను హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి తొలగించాలని ఉత్తర్వులు వెలువరించింది.
పిల్లల హక్కుల పరిరక్షణ చట్టం, 2005 సెక్షన్ 3 కింద ఏర్పాటైన జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ జరిపిన విచారణలో.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం, 2006లో హెల్త్ డ్రింక్ అని ఏ పానీయాన్నీ నిర్వచించలేదని నిర్ధరణకు వచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 10 వ తేదీన కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. అంతేకాకుండా హెల్త్ డ్రింక్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ కేటగిరి కింద ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో విక్రయించబడుతున్న డైరీ బెస్డ్ బెవరేజ్ మిక్స్, సెరియల్ బేస్డ్ బెవరేజ్ మిక్స్, మాల్ట్ బేస్డ్ బెవరేజ్‌లను కూడా హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి తొలగించాలని పేర్కొంది.
బోర్న్‌విటాలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఒకరు ఒక వీడియోను పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చింది. అంతేకాకుండా బోర్న్‌వీటాలో ఉన్న కొన్ని పదార్థాలు పిల్లలకు హాని కలిగించేలా ఉన్నాయంటూ ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ చెప్పడం పెను దుమారానికి కారణం అయింది. దీంతో ఆ ఇన్‌ఫ్లూయెన్సర్‌కు బోర్న్‌విటా బ్రాండ్ నడుపుతున్న మాండెలెజ్ ఇండియా గతంలో లీగల్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ వీడియోను అతడు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల నుంచి డిలీట్ చేశాడు.
ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో ఎన్‌సీసీసపీ విచారణ జరిపింది. బోర్న్‌విటాలో అనుమతించిన దానికంటే అధికంగా చక్కెర స్థాయిలు ఉన్నట్లు గుర్తించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు మానుకోవాలని మాండలెజ్ ఇండియాకు కేంద్రం నోటీసులు కూడా పంపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ఆదేశాలు రావడం గమనార్హం. డెయిరీ సంబంధిత, మాల్ట్ ఆధారిత డ్రింకులను హెల్త్ డ్రింకులుగా లేబుల్ చేయొద్దంటూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈనెల మొదట్లోనే ఆదేశాలు జారీ చేసింది.
![]() |
![]() |