ఉత్తరాంధ్రవాసులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం నుంచి బ్యాంకాక్ వెళ్లేందుకు కొత్త విమాన సర్వీసు మంగళవారం అందుబాటులోకి వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు కూడా ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది. ఎయిర్ ఏషియా సంస్థ వారానికి మూడు రోజుల ఈ సర్వీసును నడపనుంది. ఈ వివమానం విశాఖపట్నంలో రాత్రి 11.50 గంటలకు బయలుదేరి 2.30 గంటలకు బ్యాంకాక్‌లో ల్యాండ్ అవుతుందని ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు తెలిపారు. అక్కడ రాత్రి 7.50 గంటలకు బయలుదేరే విమానం విశాఖపట్నంలో అదేరోజు రాత్రి 11.20 గంటలకు చేరుతుందని వివరించారు. ప్రయాణానికి 2.40 గంటల సమయం పడుతుందన్నారు. ఇది మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ విమానం ప్రారంభ టికెట్ ధర రూ. 7,999.
మరోవైపు ఫిబ్రవరిలో నుంచి విశాఖ - హైదరాబాద్ విమానం ప్రారంభంకాగా.. ఏప్రిల్ 26 నుంచి విశాఖ- కౌలలాంపూర్‌కు విమాన సర్వీసులు నడవనున్నాయి. ఏప్రిల్ 26న రాత్రి 7 గంటలకు కౌలాలంపూర్ విమానం అక్కడినుంచి బయలుదేరి.. 4 గంటలలో విశాఖ చేరుకుంటుంది. ప్రారంభ టికెట్ ధర రూ. 4,999గా నిర్ణయించారు. మే, జూన్‌లో దుబాయికి మరిన్ని ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు. మార్చి 31 నాటికి ఎయిర్‌పోర్టు రన్‌వే నవీకరణ పనులు పూర్తికాగా.. ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో విమానాల రాకపోకలు ప్రారంభం అవుతున్నాయి.