ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేసే మధ్యాహ్న భోజన పథకం ఆహార నాణ్యతపై కర్ణాటకలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. కొప్పల్ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసిన బియ్యం, పప్పుల్లో పురుగులు కనిపించడంతో తల్లిదండ్రులు, అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ముఖ్యంగా కొప్పల్ తాలూకాలోని బిసరల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మంగళవారం మధ్యాహ్న భోజనం సిద్ధం చేయగా.. స్కూల్ సిబ్బంది, విద్యార్థులు అందులో పురుగులను గుర్తించారు. ముఖ్యంగా కూరల్లో నలుపు రంగు పురుగులు, అన్నంలో తెలుపు రంగు పురుగులు దర్శనం ఇచ్చాయి.
అంతకుముందు కుష్తగి తాలూకాలోని ముద్దెనహళ్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇలాంటి సంఘటనే జరగింది. అక్కడ కూడా పప్పులో నలుపు రంగు పురుగులు, ఉడికిన అన్నంలో తెలుపు రంగు పరుగులు కనిపించాయి. ఏంతో జాగ్రత్తగా చూస్తే తప్ప ఇవి కనిపించకపోవడం గమనార్హం. ముఖ్యంగా పప్పులోని పురుగులు తాలింపు గింజల్లా కనిపించడం, బియ్యంలోని తెలుపు పురుగులు అన్నం మెతుకులా కనిపించడంతో.. చాలా మంది విద్యార్థులు గుర్తించలేకపోయారు. తెలియక భోజనాన్ని తినేశారు కూడా. మొత్తంగా కొప్పల్ జిల్లాలో 2.8 లక్షల మందికి పైగా పాఠశాల విద్యార్థులు ప్రతిరోజూ ఈ మధ్యాహ్న భోజన పథకంపైనే ఆధార పడుతున్నారు. ఇలాంటి పురుగులతో కూడిన భోజనం పెట్టడం వల్ల తమ బిడ్డల జీవితాలు నాశనం అవుతాయని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమా?
మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన బియ్యం జిల్లాలోని వివిధ గోడౌన్ల నుంచి సరఫరా అవుతున్నప్పటికీ.. పప్పు, నూనె, ఇతర సరుకులు మాత్రం నిర్దేశిత ఏజెన్సీల ద్వారా అందించబడుతున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం.. నాసిరకం బియ్యం, పప్పును ప్రైవేట్ కాంట్రాక్టర్లు సరఫరా చేసి ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వరుస సంఘటనల నేపథ్యంలో.. ఉపాధ్యాయులు, విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆహార ధాన్యాలు, వండిన భోజనాలను తక్షణమే తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్యపై అధికారులు స్పందిస్తూ.. పూర్తి స్థాయిలో విచారణ జరిపి, సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని హామీ ఇచ్చారు. నింగపూర్ స్కూల్ డెవలప్‌మెంట్ అండ్ మానిటరింగ్ కమిటీ అధ్యక్షుడు హనుమంతప్ప హట్టి మాట్లాడుతూ.. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇలాంటి ఘటనలు జరిగి ఉండవచ్చునని, అయితే పరిశుభ్రత, నాణ్యతను కాపాడటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa