ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశాంత్ కిషోర్‌తో ప్రియాంక గాంధీ భేటీ.. రహస్య భేటీపై ఊహాగానాలు

national |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 08:35 PM

కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో జన్ సూరజ్ పార్టీ అధినేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గతవారం ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో సమావేశమైనట్టు విశ్వసనీయ వర్గాలు జాతీయ మీడియాకు సోమవారం వెల్లడించాయి. బిహార్ ఎన్నికల్లో మహాఘట్‌బంధన్, జేఎస్పీలు దారుణ పరాజయం అనంతరం ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి వాటిని విజయతీరాలకు చేర్చిన ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రం బిహార్‌లో మాత్రం బొక్కబోర్లాపడ్డారు. ఆయన పార్టీ ఒక్కటంటే ఒక్కసీటు కాదు.. కనీసం ఎక్కడా డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది.


ఈ సమావేశం గురించి ప్రియాంక గాంధీని వివరణ కోరగా.. ‘‘నేను ఎవరిని కలుస్తాను... లేదా ఎవరిని కలవను అనే దానిపై ఎవరికీ ఆసక్తి లేదు’’ అని అన్నారు, అయితే పీకే మాత్రం కాంగ్రెస్ నాయకురాలితో ఎలాంటి సమావేశం జరగలేదని ఖరాఖండిగా తేల్చిచెప్పారు. ఏది ఏమైనప్పటికీ, ప్రియాంక గాంధీ-పీకే భేటీ గురించి తెలిసిన వర్గాలు మాట్లాడుతూ.. బీహార్ ఎన్నికల్లో ఇరు పార్టీల ప్రదర్శన గురించి మాట్లాడుకున్నట్టు తెలిపారు. జన సురాజ్ 238 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఒక్కటి కూడా గెలవలేదు, కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఆరింటిలో మాత్రమే గెలిచింది. 2020 ఎన్నికలతో పోలిస్తే 13 స్థానాలు తక్కువ.


ఇక, 2017లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. అప్పుడు జరిగిన పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా.. యూపీలో మాత్రం సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్‌ కూటమికి ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ నేతలు కొందరు పీకే తీరుపై విమర్శలు గుప్పించగా.. ప్రశాంత్ కిషోర్ సైతం కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం తనకు ‘చేదు అనుభవం’గా మారిందని ఆరోపించారు. పార్టీ సంస్థాగత సంస్కృతి, నిర్ణయాలు తీసుకునే విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.


కానీ, నాలుగేళ్ల తర్వాత యూపీ 2022 ఎన్నికలకు ముందు పీకే కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలు గుప్పుమన్నాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకలతో భేటీ కావడం ప్రచారానికి మరింత బలం చేకూరింది. చర్చలు సఫలమై పీకే చేరిక దాదాపు ఖాయమైంది. కానీ, ఇంతలోనే ప్రశాంత్ కిషోర్ తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరడం లేదని ప్రకటించారు.


కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను పూర్తిగా పునర్నిర్మించేందుకు పీకే కోరుకున్న స్వేచ్ఛ ఇవ్వడానికే ప్రియాంక గాంధీ సానుకూలంగా ఉన్నా.. పార్టీ సీనియర్ నేతలు ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా అంగీకరించలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి నా కంటే ఎక్కువగా పార్టీకి నాయకత్వం, సమిష్టి సంకల్పం అవసరమని పీకే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చివరకు సొంతంగా రాజకీయ వేదికను ఏర్పాటుచేసుకున్నారు. బిహార్‌లో మార్పు కోసం తమ పార్టీ పనిచేస్తుందని ప్రకటించుకున్నారు. అది నిజంగా జరిగిందో లేదో పక్కన పెడితే, ఫలితం మాత్రం ఆయనకు మాత్రమే కాకుండా మొత్తం ప్రతిపక్షానికి తీవ్ర నిరాశను మిగిల్చింది. 2020లో ప్రదర్శనకు మించి ఫలితం మెరుగ్గా ఉంటుందని భావించిన కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ పూర్తిగా విఫలమైంది.


ఈ పరాజయాల నేపథ్యంలో వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్, అసోం, 2027లో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పీకే, కాంగ్రెస్ సంబంధాలను మళ్లీ పునఃపరిశీలిస్తున్నారని వర్గాలు సూచిస్తున్నాయి. అసలైన సవాల్ 2029 లోక్‌సభ ఎన్నికలే. ఆ ఎన్నికల్లో బీజేపీ వరుసగా నాలుగో సారి అధికారాన్ని దక్కించుకునే ప్రయత్నం చేయనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa