బ్రిటిష్ మాజీ పారాట్రూపర్ అయిన కార్ల్ బుష్బీ .. ప్రపంచ దేశాలను కాలినడకన తిరుగుతున్నాడు. 1998లో తన 29వ ఏట.. ప్రపంచాన్ని మొత్తం చుట్టి వచ్చే అసాధారణమైన గోలియత్ ఎక్స్‌పెడిషన్‌ను మొదలుపెట్టాడు. గత 27 సంవత్సరాలుగా నిరంతరాయంగా నడుస్తూ.. 25 దేశాలను దాటేశాడు. ఈ కాలంలో ఇప్పటివరకు 50 వేల కిలోమీటర్లు నడిచాడు. ఎడారి ప్రాంతాలతోపాటు.. గడ్డకట్టిన సముద్రాలను దాటేసి.. ఇప్పుడు తన ప్రయాణాన్ని పూర్తి చేసేందుకు కేవలం 16000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఈ ప్రయాణంలో యుద్ధాలు జరిగే దేశాల మీదుగా కూడా కార్ల్ బుష్బీ ప్రయాణం సాగించడం విశేషం.
చిలీ దేశంలో ప్రారంభమైన ఈ 50 వేల కిలోమీటర్ల నడక యాత్ర.. ఇప్పటివరకు ఏ మానవుడు చేయని సుదీర్ఘ నడక యాత్రగా నిలిచింది. 2008 ఆర్థిక సంక్షోభం, కొవిడ్-19 మహమ్మారి సహా ఎన్నో అడ్డంకులను అధిగమించిన కార్ల్ బుష్బీ.. 2026 సెప్టెంబర్ నాటికి ఇంగ్లాండ్‌లోని తన స్వస్థలం హల్‌కు చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
ప్రతిజ్ఞతో మొదలైన నడక!
బ్రిటన్‌కు చెందిన కార్ల్ బుష్బీ.. 29 ఏళ్ల వయసు ఉన్నపుడు.. 1998 నవంబర్‌లో తన ముందు ఒక అసాధారణ సాహసాన్ని పెట్టుకున్నాడు. ప్రపంచాన్ని చుట్టి రావడానికి మోటారుతో నడిచే ఎలాంటి రవాణా సాధనాన్ని ఉపయోగించకూడదని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. 27 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత.. ఇప్పుడు 56 ఏళ్ల వయస్సులో.. ఆయన తన గమ్యస్థానానికి చేరువకు వచ్చారు.
చిలీ దేశానికి అంచున తన గోలియత్ ఎక్స్‌పెడిషన్ యాత్రను ప్రారంభించిన కార్ల్ బుష్బీ.. నడక ద్వారా మాత్రమే ఇంగ్లాండ్‌లోని తన ఇంటికి తిరిగి వస్తానని శపథం చేశారు. అయితే 8 నుంచి 12 ఏళ్లలో ఈ ప్రపంచ యాత్రను పూర్తి చేసి.. తన ఇంటికి చేరుకోవాలని కార్ల్ బుష్బీ నిర్ణయించుకున్నాడు. కానీ రాజకీయపరమైన, ఆర్థికపరమైన, లాజిస్టికల్ అడ్డంకుల కారణంగా.. ఈ ప్రయాణం కాస్తా.. సుదీర్ఘంగా దాదాపు 3 దశాబ్దాలకు చేరుకుంది.
కార్ల్ బుష్బీ తన నడక యాత్రలో ఇప్పటివరకు 25 దేశాలను దాటాడు. ఏకంగా 50 వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. పాటగోనియా, ఆండీస్ పర్వతాలు, మధ్య అమెరికా, మెక్సికో, యూఎస్, రష్యా, మంగోలియా, ఆసియాలోని కొన్ని దేశాల గుండా కార్ల్ బుష్బీ నడక సాగించాడు. పనామా, కొలంబియా దేశాల మధ్య ఉన్న ప్రమాదకరమైన డేరియన్ గ్యాప్‌ను కూడా ఆయన నడుచుకుంటూనే దాటడం గమనార్హం.
2006 మార్చిలో కార్ల్ బుష్బీ.. తన తోటి సాహసికుడు డిమిత్రి కీఫర్.. అలాస్కా నుంచి సైబీరియాకు గడ్డకట్టిన బేరింగ్ జలసంధిని కాలినడకన దాటిన మొదటి వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. 2024 ఆగస్ట్ నెలలో.. రాజకీయపరమైన ఉద్రిక్తతల కారణంగా ఇరాన్, రష్యాలోకి ప్రవేశించకుండా ఉండటానికి.. ఆయన తన మార్గాన్ని మార్చుకున్నాడు. కజకిస్తాన్ నుంచి అజర్‌బైజాన్ వరకు కాస్పియన్ సముద్రం గుండా 179 మైళ్లు అంటే దాదాపు 300 కిలోమీటర్లు ఈత కొట్టాడు. ఈ ఈత కొట్టే సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు సహాయక పడవలను ఉపయోగించాడు. ఇలా కజకిస్తాన్ నుంచి అజర్‌బైజాన్‌కు చేరుకునేందుకు ఆయనకు 31 రోజులు పట్టింది.
ఆ తర్వాత.. కాకసస్, టర్కీ గుండా నడుచుకుంటూ.. 2025లో బాస్పోరస్ జలసంధిని దాటి యూరప్‌లోకి ప్రవేశించారు. మార్గ మధ్యలో ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ.. ఈ నడక మార్గంలో తాను పెట్టుకున్న ప్రధాన నియమం మాత్రం ఎక్కడా అతిక్రమించలేదు. తన యాత్రలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. ముందుకు సాగడానికి వాహనాలను ఉపయోగించలేదు. తన గమ్యాన్ని నడుచుకుంటూ చేరుకునే వరకు ఇంటికి తిరిగి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు.
ప్రస్తుతం 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంగేరీ గుండా నడుస్తున్న కార్ల్ బుష్బీ.. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి తన స్వస్థలం ఇంగ్లాండ్‌లోని హల్‌కు చేరుకుంటారని అంచనా వేస్తున్నాడు. సక్సెస్‌ఫుల్‌గా ఈ యాత్రను కార్ల్ పూర్తి చేస్తే.. ప్రపంచాన్ని నిరంతరాయంగా, విరామం లేకుండా చుట్టివచ్చిన మొట్టమొదటి వ్యక్తిగా ఆయన ప్రపంచ రికార్డును నెలకొల్పనున్నాడు. ఆయన అపారమైన సహనం, సంకల్ప శక్తికి ఇది గొప్ప నిదర్శనంగా నిలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa