ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ.. పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను తమ ప్రసంగాల ద్వారా ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి నేతల చేసే వ్యాఖ్యలు వివాదాస్పదమవుతుంటాయి. అలాంటి పరిస్థితే ప్రస్తుతం మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. జేసీ ఫ్యామిలీ ప్రస్తుతం టీడీపీలో ఉంది. తాడిపత్రి అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో సోదరుడి కోసం జేసీ పవన్ కుమార్ రెడ్డి తాడిపత్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అనంతపురం లోక్ సభ టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణతో కలిసి జేసీ పవన్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. అయితే ఎన్నికల ప్రచారంలో జేసీ పవన్ కుమార్ రెడ్డి నోరు జారారు. తన సోదరుడు జేసీ అస్మిత్ రెడ్డితో పాటుగా.. అంబికా లక్ష్మినారాయణను గెలిపించాలని కోరిన పవన్ కుమార్ రెడ్డి.. ఇందుకోసం యువత వీలైతే రెండు దొంగ ఓట్లైనా వేయాలని పిలుపునిచ్చారు. అయితే ఎన్నికల ప్రచారంలో జేసీ పవన్ బహిరంగంగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. అధికార వైసీపీ దీనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా దొంగ ఓట్లు వేయాలని కోరడం ఏమిటంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తరహాలోనే టీడీపీ నేతలు కూడా ఇదే వైఖరి ఫాలో అవుతున్నారని విమర్శ లు చేస్తున్నారు. జేసీ పవన్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి వైరల్ అవుతున్న వీడియో మీద ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేదీ చూడాలి మరి.
మరోవైపు అనంతపురం ఎంపీ స్థానానికి పోటీ చేయాలని జేసీ పవన్ కుమార్ రెడ్డి భావించారు. 2019 ఎన్నికల్లోనూ ఆయన ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు.అయితే ఒక కుటుంబానికి ఒకే సీటు అనే విధానంలో టీడీపీ అధిష్టానం.. జేసీ కుటుంబానికి మరో టికెట్ నిరాకరించింది. దీంతో తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా జేసీ అస్మిత్ రెడ్డి బరిలో నిలవగా.. జేసీ పవన్ కుమార్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. సోదరుడి తరుఫున, అనంతపురం లోక్ సభ టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ తరుఫున ప్రచారం చేసే పనిలో పడ్డారు.