పూడి- ఏర్పేడు రైల్వేస్టేషన్ల మధ్య నూతన రైలు మార్గం ఏర్పాటు చేయడానికి రైల్వే బోర్డు చర్యలు ప్రారంభించింది. దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశంలోని ప్రధాన నగరాలకు తక్కువ సమయంలో వస్తు రవాణా చేయడానికి రైల్వే బోర్డు ఈ నూతన మార్గాన్ని వేయడానికి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వస్తు రవాణా చేసే గూడ్స్ రైళ్లు పూడి నుంచి రేణిగుంట రైల్వే జంక్షన్‌కు చేరుకుంటాయి. అక్కడి నుంచి ముంబాయి, విజయవాడ మార్గాలవైపు వెళతాయి. సదరన్ రైల్వే నుంచి ఉత్తర భారత దేశంలోని ప్రధాన నగరాలకు వస్తు రవాణా చేయడానికి రేణిగుంట రైల్వే జంక్షన్‌లో కొంత ఆలస్యం జరుగుతోందని రైల్వే బోర్డు అధ్యయనం చేసింది. ఈ మార్గంలో గూడ్స్ రైళ్లతో పాటు సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా రాకపోకలు నిర్వహించే అవకాశం ఉంటుందని అధికారులు గుర్తించారు. రైల్వే నిబంధనల మేరకు ప్రాథమిక సర్వే నిర్వహించారు. పూడి నుంచి ఏర్పేడు రైల్వేస్టేషన్ వరకు 27 కిలోమీటర్ల దూరం సర్వే చేసినట్లు సమాచారం. ఈ మార్గంలో ఒక రైల్వేస్టేషన్ కూడా వస్తుంది. ఈ రైలు మార్గం పూర్తిచేస్తే రేణిగుంట రైల్వే జంక్షన్‌లో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రేణిగుంట రైల్వే జంక్షన్‌పై రైళ్ల రాకపోకల ఒత్తిడీ తగ్గే అవకాశాలున్నాయి. ఈప్రాంతం నుంచి రైతులు పండించే వస్తువులు కూడా దూర ప్రాంతాలకు రవాణా చేసే అవకాశం ఏర్పడనుంది. అలాగే రేణిగుంట, ఏర్పేడు మండలాల్లోని భారీ పరిశ్రమల ఉత్పత్తులు కూడా రవాణా చేయడానికి అనుకూలంగా ఉంటుంది.