రాష్ట్రంలో ఐదేళ్లు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని టీడీపీ నేత బోండా ఉమా విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నాయకులను పోలీసులు వేధించారన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక, నామినేషన్‌లు వేశాక కూడా పోలీసులు అరాచకాలు ఆగలేదన్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడితో కొంతమంది పోలీసులు టీడీపీ అభ్యర్థులపై అనేక కేసులు పెట్టారన్నారు. తప్పుడు కేసులు పెట్టారనేందుకు తానే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. సీఎం పరిధిలో పోలీసులు లేరనే విషయం కూడా తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసులు పనిచేయాలన్నారు. సజ్జల, మరో గొట్టంగాడు చెప్పాడని తమపై అక్రమ కేసులా అంటూ విరుచుకుపడ్డారు. నిన్న ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందన్నారు. పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల నియమావళి వర్తిస్తుందని తెలిపారు. వైసీపీ కండువా కప్పుకుని పనిచేసే పోలీసులపై ఫిర్యాదు చేస్తామని.. చట్టానికి, నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నార్త్ ఏసీపీ డి.యన్.ఎ ప్రసాద్, సీఐ దుర్గా ప్రసాద్‌లు వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపించారు.