2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో 2024 పేరుతో ఎన్నికల ప్రణాళికల విడుదల చేశారు. రెండు పేజీలతో కూడిన YSRCP మేనిఫెస్టోలో ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తూనే అందించే లబ్ధి మొత్తాన్ని పెంచారు.9 ముఖ్యమైన హామీలతో కూడిన వైఎస్ జగన్ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించారు.
ఇక మ్యానిఫెస్టోలో అవ్వాతాతలతో పాటు పింఛన్ దారులకు వైఎస్ జగన్ శుభవార్త అందించారు. ప్రస్తుతం అందిస్తున్న పింఛన్ 3 వేల మొత్తాన్ని రెండు విడతల్లో రూ.3500 కు పెంచుతామని హామీ ఇచ్చారు. 2028 జనవరిలో పింఛన్ మొత్తాన్ని రూ.3250 రూపాయలకు, 2029 జనవరిలో రూ.3500లకు పెంచుతామని ప్రకటించారు. అమ్మఒడి కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రస్తుతం 15 వేల చొప్పున జమ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని 17 వేల రూపాయలకు పెంచుతామని జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న అమ్మ ఒడి సాయం 15 వేల రూపాయలలో 2 వేల రూపాయలను పాఠశాల నిర్వహణ, టాయిలెట్ మేనేజ్‌మెంట్ కోసం తిరిగి తీసుకుంటున్నారు. అయితే ఈ మొత్తాన్ని 17 వేలకు పెంచుతామని జగన్ మ్యానిఫెస్టోలో వెల్లడించారు.
ఇక 45 ఏళ్లకు పైబడిన ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్‌ఆర్ చేయూత ఏడాదికి రూ.18, 750 చొప్పున రూ.75000 అందిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తాము గెలిచి అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ చేయూత సాయాన్ని రూ. 75 వేల నుంచి రూ.1. 50 లక్షలకు పెంపు చేస్తామని జగన్ తెలిపారు. అలాగే కాపు నేస్తం కింద అందించే సాయాన్ని రూ. 60 వేల నుంచి 1. 20 లక్షలకు పెంచుతామని వైఎస్ జగన్ ప్రకటించారు. ఈబీసీ నేస్తం సాయాన్ని కూడా రూ. 45 వేల నుంచి రూ. 1. 05 లక్షలకు పెంచుతామని చెప్పారు. అలాగే వైఎస్ ఆర్ సున్నా వడ్డీ కింద రూ. 3 లక్షల వరకు రుణాలు ఇస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అలాగే వైస్సార్ రైతు భరోసా కింద రైతులకు అందించే సాయాన్ని రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచుతామని తెలిపారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తున్నట్లు జగన్ చెప్పారు.