ఉత్తరాఖండ్‌లో ఉన్న చార్‌ధామ్ యాత్రకు షెడ్యూల్ విడుదల అయింది. మే 10 వ తేదీ నుంచి అక్టోబర్ 31 వ తేదీ వరకు చార్‌ధామ్ యాత్ర జరగనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ చార్‌ధామ్ యాత్రకు వెళ్లేందుకు ఈ ఏడాది ఇప్పటివరకు 19 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక గతేడాది ఏకంగా 55 లక్షల మంది భక్తులు చార్‌ధామ్‌ను దర్శించుకున్నారు. గతేడాది తీవ్ర ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో ఈసారి ఉత్తరాఖండ్ ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. ఉత్తరాఖండ్ పోలీసులు, పర్యాటక శాఖలు సమన్వయంతో మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గతేడాది జరిగిన భక్తుల మరణాలను దృష్టిలో ఉంచుకుని.. ఈసారి చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్యపై పరిమితిని విధించింది.
చార్‌ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రికి భక్తులు పోటెత్తనున్నారు. అయితే ఈ ఆలయాలను దర్శించుకునే భక్తులపై పరిమితిని విధిస్తూ ఉత్తరాఖండ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతేడాది చార్‌ధామ్ యాత్రలో నెలకొన్న సమస్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీని ప్రకారం చార్‌ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ధామ్‌లోని బాబా మహాకాల్‌ను రోజుకు కేవలం 15 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇక బద్రీనాథ్ ధామ్‌ను రోజుకు 16 వేల మంది.. గంగోత్రిలో 11 వేల మంది.. యమునోత్రిలో 9 వేల మంది భక్తులు దర్శించుకునేలా పరిమితులు విధించారు.
ఒకవేళ భక్తులు భారీగా తరలివస్తే.. వారిని అడ్డుకునేందుకు త్రిషికేశ్‌లో ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఇక బద్రీనాథ్ వెళ్లాలనే వారిని ముందుగా శ్రీనగర్‌లో నిలుపుతారని ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ తెలిపింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే రాత్రి శ్రీనగర్‌లోనే బస చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రుద్రప్రయాగ్, చమోలి, పిప్పల్‌కోటి, జోషిమఠ్‌లలో ఆ తర్వాతి రోజు యాత్ర సాగనుంది. ఇక మే 10 వ తేదీన చార్‌ధామ్ యాత్ర మొదలుకానుండగా.. తొలి 15 రోజుల్లోనే 10 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో మే 10 వ తేదీ నుంచి మే 25 వ తేదీ వరకు వీఐపీలు రావద్దని.. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. చార్‌ధామ్ యాత్రలో భాగంగా మొదట భక్తులు.. యమునోత్రిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత యమునోత్రి నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగోత్రి ధామ్‌ను సందర్శిస్తారు. గంగోత్రి అనంతరం.. కేదార్‌నాథ్.. చివరిగా బద్రీనాథ్ ధామ్‌ను దర్శించుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa