ఏపీ లో శాంతి భద్రతలు ఆందోళన కలిగిస్తున్నాయని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని గతంలో ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం గత ఐదేళ్ల నుంచి చూశామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై కూడా కేసులు పెట్టారన్నారు. నోటిఫికేషన్ తర్వాత చీఫ్ సెక్రెటరీ, డీజీపీ, అధికారులు అందరూ ఎన్నికల సంఘం అధీనంలో ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ కింద అధికారులు పని చేయకుండా జగన్ కింద పని చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు పారదర్శకంగా జరపాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. వందల మంది వైసీపీ నేతలు.. ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తున్నారన్నారు. రాజకీయ హత్యలకు కూడా వైసీపీ నేతలు పాల్పడుతున్నారని తెలిపారు. గతంలో ప్రధాన మంత్రి సభ సజావుగా జరగకుండా చేశారన్నారు. పోలీసులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కనకమేడల రవీంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.