ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి ఆస్తి ఎవరు లాక్కోగలరని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతిపక్షాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్స్‌పై తప్పుడుప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శనివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు, పచ్చ మీడియాకు ఎందుకు కడుపు మంటో అర్ధం కావడం లేదు. ఏకంగా మీ భూమి మీది కాదు అంటూ రాతలు రాస్తున్నారు. అసలేంటీ రాతలు? నా భూమి నాది కాకపోతే మరెవరది? మరొక పేపర్లో, నేల చట్టంలో..నింగీ..గాలి అంటూ రాతలు రాశాడు. ఈ రాతలు పోలింగ్ జరిగే వరకే. ఆ మర్నాడు వాళ్లు ఈ వార్తలు రాస్తే అడగండి. అప్పుడు వీళ్లకు, సామాజిక బాధ్యత ఏమీ ఉండదు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఏదో ఒక విధంగా ప్రజలను మభ్యపెట్టి తమ ఫ్రెండ్స్‌గా ఉన్న కూటమికి లాభం చేకూర్చాలనే. ప్రజలేమన్నా అమాయకులనుకుంటున్నారా? మీ మాట ఎవరు నమ్ముతారు? మీరు చేసే ప్రచారం, వాస్తవాలకు ఇంత దూరంగా ఉంటే, ఇక ప్రజలు నమ్ముతారనుకోవడం మీ భ్రమే. ఏ కోణంలో మీ భూమి మీది కాదో వాళ్లు సమాధానం చెప్పాలి. మీ అనుమానాలేంటి అడగండి.. నేను సమాధానం చెప్తాను. ప్రజలకు కూడా మీ రాతలపై క్లారిటీ కావాలి కదా? మీరు చేస్తున్న మాయ, మోసం, మీ కడుపు మంట ప్రజలకు తెలియాలి. రామోజీరావు, రాధాకృష్ణల బాధ కూడా ప్రజలకు తెలియాలి కదా? అడగండి..నేను సమాధానం చెప్తా అని ఆగ్రహం వ్యక్తపరిచారు.