సార్వత్రిక ఎన్నికల వేళ జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి సంబంధించిన వాహనాల కాన్వాయ్ వెళ్తుండగా.. ముష్కరులు రెచ్చిపోయారు. పూంచ్ జిల్లాలోని సూరన్‌కోట్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఉగ్రదాడిలో నలుగురు ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులపైకి ఎదురు కాల్పులు చేశారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు యాంటీ టెర్రర్ ఆపరేషన్ కొనసాగుతోంది.
అయితే గత ఏడాది సైన్యంపై ఉగ్రవాదులు వరుసగా దాడులకు పాల్పడ్డారు. అయితే ఆ దాడులను భద్రతా బలగాలు కూడా సమర్థవంతంగా తిప్పికొట్టారు. అయితే ఈ ఏడాది కూడా సైన్యంపై కొన్ని దాడులు జరగ్గా.. తాజాగా జరిగిన దాడే అతిపెద్దది అని భద్రతా బలగాలు వెల్లడించాయి. ఈ దాడిలో ఇప్పటివరకు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని తెలుస్తోంది. ఇక ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై దాడి జరిగిన ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు. గాయపడిన ఎయిర్‌ఫోర్స్ సిబ్బందిని వెంటనే చికిత్స కోసం దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది వెళ్తున్న వాహనాల కాన్వాయ్‌పై ఉగ్ర దాడి జరిగినట్లు భద్రతా దళాలకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనపై అలర్ట్ అయిన స్థానిక రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్.. ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. షాసితార్ సమీపంలోని ఎయిర్ బేస్ లోపల ఎయిర్‌ఫోర్స్ వాహనాలను ఉంచినట్లు చెప్పారు. కొందరు సైనిక సిబ్బందికి గాయాలు అయ్యాయని.. వారికి చికిత్స అందుతోందని వెల్లడించారు.