లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో చెలరేగిన ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల వ్యవహారం దేశంలో పెను దుమారానికి కారణం అయింది. ఈ కేసులో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణతోపాటు.. హెచ్‌డీ దేవగౌడ కుమారుడు హెచ్‌డీ రేవణ్ణ.. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే సెక్స్ వీడియోలు బయటికి రాగానే జర్మనీ పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతడ్ని దేశానికి రప్పించి అరెస్ట్ చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్-సిట్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ నివాసంలో ఉండగానే హెచ్‌డీ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంట్లో గతంలో పనిచేసి మానేసిన ఓ మహిళ కిడ్నాప్ అయిందంటూ దాఖలైన కేసులో హెచ్‌డీ రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఆ మహిళ కనిపించకుండా పోగా.. ఆ కేసులో హెచ్‌డీ రేవణ్ణ, అతని సహాయకుడు సతీష్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
ఆ మహిళ హెచ్‌డీ రేవణ్ణ ఇంట్లో 5 ఏళ్ల పాటు పనిచేసి.. 3 ఏళ్ల క్రితం పని మానేసి వెళ్లిపోయింది. అయితే ఆ మహిళను ఏప్రిల్ 26 వ తేదీన హెచ్‌డీ రేవణ్ణ పిలుస్తున్నాడని చెప్పి.. అతని సహాయకుడు సతీష్ బలవంతంగా తీసుకెళ్లి తర్వాతి రోజు తీసుకువచ్చాడు. అనంతరం ఏప్రిల్ 29 వ తేదీన ఆమెను మళ్లీ తీసుకుని వెళ్లగా.. అప్పటి నుంచి ఆ మహిళ కనిపించకుండా పోయింది. ఈ ఘటనపై బాధిత మహిళ కుమారుడు ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసు పెట్టారు.
అంతేకాకుండా ఆయన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల కేసులో కూడా హెచ్‌డీ రేవణ్ణపైనా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అయితే హెచ్‌డీ రేవణ్ణను అరెస్ట్ చేయడానికి ముందే ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని స్థానిక కోర్టు తిరస్కరించింది. మరోవైపు హెచ్‌డీ రేవణ్ణ కూడా ప్రజ్వల్ రేవణ్ణ లాగే ఎంతో మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇక ఈ సెక్స్ వీడియోల కేసులో హెచ్‌డీ రేవణ్ణ కుమారుడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే కర్ణాటక పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.