ఓ వ్యక్తి గతంలో ఓ యువతిని ప్రేమించాడు. అయితే ఏవో కారణాల వల్ల వారి పెళ్లి జరగలేదు. ఆ యువతికి వేరే వ్యక్తితో పెళ్లి అయిపోయింది. ఇక అంతటితే ఆ ప్రేమికుడు ఊరుకోలేదు.. తనకు దక్కని ప్రియురాలిని ఇంకొకరికి దక్కకూడదు అనుకున్నాడో లేక తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్న వాడిని అంతం చేయాలని భావించాడో ఏమో కానీ.. వారి ఇంటికి ఏకంగా ఓ బాంబునే పార్సిల్‌గా పంపించాడు. ఆ పార్సిల్‌ను ప్రియురాలి భర్త, కుమార్తె తెరిచి చూడగా ఒక్కసారిగా పేలింది. దీంతో ప్రియురాలి భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుమార్తెను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. అయితే ఈ బాంబు పేలిన సమయంలో అతని ప్రియురాలు ఇంట్లో లేకపోవడం గమనార్హం.
ఈ దుర్ఘటన గుజరాత్‌లోని వడాలిలో మే 2 వ తేదీన చోటుచేసుకుంది. జయంతిభాయ్ బాలు సింగ్ వంజారా అనే 31 ఏళ్ల వ్యక్తి.. గతంలో ఓ యువతిని ప్రేమించాడు. అయితే ఆమెకు జీతూభాయ్ హీరాభాయ్ వంజారా అనే 32 ఏళ్ల వ్యక్తితో పెళ్లి అయింది. వారు వడాలిలో కూలి పని చేసుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. ఇక గురువారం రోజున వారి ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసేందుకు జీతూభాయ్ హీరాభాయ్ వంజారా.. అతని కుమార్తె 12 ఏళ్ల భూమిక ప్రయత్నించగా.. అది ఒక్కసారిగా పేలిపోయింది.
ఈ ఘటనలో జీతూభాయ్ హీరాభాయ్ వంజారా ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇక బాంబు పేలుడు ధాటికి ముగ్గురు కుమార్తెలకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. భూమిక మార్గమధ్యలోనే మృత్యువాత పడింది. ప్రస్తుతం వారి మరో ఇద్దరు కుమార్తెలు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు.. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో జీతూభాయ్ హీరాభాయ్ వంజారా భార్య ఇంట్లో లేకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో ఆమె పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు.. ఆ పార్సిల్ తెచ్చిన రిక్షా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. నిందితుడు జయంతిభాయ్ బాలుసింగ్ వంజారా వివరాలు వెల్లడించారు. ఆ సమాచారంతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడు బాంబు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల కోసం రాజస్థాన్‌కు వెళ్లి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. టేప్ రికార్డర్‌లో ఆ బాంబును పెట్టి దాన్ని ఆన్ చేయగానే పేలేలా తయారు చేసినట్లు వెల్లడించారు. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్న జీతూభాయ్‌ని హతమార్చేందుకే బాంబును పార్సిల్ చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు.