ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం ఐదు గంటల్లోగా హరీష్ కుమార్ గుప్తా విధుల్లోకి చేరాలని ఆదేశించింది. హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 1992 బ్యాచుకు చెందిన హరీష్ కుమార్ గుప్తాను ఏపీ నూతన డీజీపీగా ఎన్నికల సంఘం నియమించింది.
మరోవైపు ఏపీ డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద ఎన్నికల సంఘం ఆదివారం బదిలీ వేటు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. విపక్షాల ఫిర్యాదుల ఆధారంగా కేవీ రాజేంద్రనాథ్‌ను బదిలీ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలతో సంబంధం లేని విధులు కేటాయించాలని ఏపీ సీఎస్‌ను అదివారం ఆదేశించిన ఈసీ.. నూతన డీజీపీ నియామకం కోసం ముగ్గురు పేర్లను పంపాలని సూచించింది. దీంతో నూతన డీజీపీ పోస్టులో నియమించేందుకు ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్‌ను ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి పంపింది. సీనియారిటీ ఆధారంగా ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లను ఈసీకి పంపగా.. వారిలో హరీష్ కుమార్ గుప్తా వైపు ఈసీ మొగ్గు చూపింది.
మరోవైపు ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని మరో అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. అమ్మిరెడ్డిని తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. అలాగే ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది. అమ్మిరెడ్డి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలోనే ఆయనపై బదిలీ వేటు వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇప్పటికే అనంతపురం ఎస్పీని సైతం బదిలీ చేసిన ఈసీ.. ఆయన స్థానంలో అమిత్ బర్దర్‌ను నియమించింది.