పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ... ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ప్రచార గడువు ముగిసేందుకు సమయం సమీపిస్తుండటంతో పార్టీలన్నీ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమి తరుఫున ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రిలోని వేమగిరిలో నిర్వహించిన భారీ బహిరంగసభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీ ప్రజలు వైసీపీకి ఐదేళ్లు అవకాశం ఇచ్చారన్న ప్రధాని.. కానీ వైసీపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమర్శించారు. వైసీపీ పాలనలో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించిన మోదీ.. అభివృద్ధి శూన్యం, అవినీతిలో మాత్రం నంబర్‌వన్ అంటూ ఆరోపించారు. ఐదేళ్లల్లో ఏపీలో ఇసుక మాఫియా, లిక్కపర్ మాఫియా నడుస్తోందని ఆరోపించారు. వైసీపీకి ఆర్థిక క్రమశిక్షణ లేదని అన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామన్న వైసీపీ.. ఐదేళ్లలో ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేయలేదని తప్పుబట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ అభివృద్ధి అనే పట్టాలపై పరిగెత్తిందన్న మోదీ.. వైసీపీ హయాంలో ఏపీలో అభివృద్ధి పట్టాలు తప్పిందని విమర్శించారు.పోలవరం ప్రాజెక్టుపైనా వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న ప్రధాని.. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఈ పరిస్థితి మారుస్తామని అన్నారు.
ఏపీలో ఎన్డీఏ కూటమితో ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు వైసీపీ తలపడుతున్నాయన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ప్రతిచోటా ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందన్న మోదీ.. మే 13వ తేదీ ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలవుతుందని అన్నారు.
అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి తరుఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న రెండో బహిరంగ సభ ఇది. మార్చిలో టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత చిలకలూరిపేటలో జరిగిన బహిరంగసభలో ప్రధాని పాల్గొన్నారు. అయితే నాటి ప్రసంగంలో వైఎస్ జగన్ మీద, వైసీపీ మీద పెద్దగా ఆరోపణలు లేకుండానే మోదీ ప్రసంగం సాగింది. వైఎస్ జగన్ పేరు ప్రస్తావించకుండానే మోదీ ప్రసంగం సాగగా.. ప్రధాని ప్రసంగం కంటే పక్కన అంశాలే నాటి సభలో హైలెట్ అయ్యాయి. మైక్‌లు మొరాయించడం, భద్రతా వైఫల్యంతో ఆ సభ నిర్వహణ మీద విమర్శలు వచ్చాయి. అయితే నాటి సభలో జగన్ గురించి పెద్దగా ప్రస్తావించని మోదీ.. రాజమండ్రి మీటింగ్‌లో మాత్రం వైసీపీ ప్రభుత్వం మీద, వైఎస్ జగన్ మీదా నేరుగా విమర్శలు చేశారు.
ఏపీలో అభివృద్ధి శూన్యమని.. అవినీతి పెరిగిపోయిందంటూ జగన్ ప్రభుత్వంపై ప్రధాని విమర్శలు గుప్పించారు. శాండ్, లిక్కర్ మాఫియా అంశాలను, రాజధాని, పోలవరం అంశాలను ప్రస్తావిస్తూ వైసీపీ మీద విమర్శలు చేశారు. అయితే చిలకలూరిపేట సభలో ప్రధాని ప్రసంగంతో నిరాశకు గురైన తెలుగు తమ్ముళ్లు.. రాజమండ్రి మీటింగ్‌లో ప్రధాని మాటలతో సంబరపడుతున్నారు. ప్రధాని నేరుగా వైఎస్ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.