ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలకు నిధుల విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. విడుదలకు అనుమతి ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. తుపాను, కరవు కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు అందించే ఇన్ ఫుట్ సబ్బిడీ.. విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలకు అంగీకరించాలంటూ ఏపీ ప్రభుత్వం ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖరాసింది.
డీబీటీ విధానం ద్వారా చెల్లింపులు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఈసీకి లేఖ రాసింది.ఈ పథకాలన్నీ గత ఐదేళ్ల నుంచి అమల్లో ఉన్నవేనని.. కొత్త పథకాలు కావని పేర్కొంది. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలు కావున నిధుల విడుదలకు అంగీకరించాలని కోరింది. అయితే ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను ఈసీ తోసిపుచ్చింది. నిధుల విడుదలకు అనుమతి నిరాకరించింది. ఎన్నికల కోడ్ పూర్తయ్యాక నిధులు విడుదల చేసుకోవాలని సూచించింది. మరోవైపు ఏపీలో మే 13వ తేదీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫలితాలు వెల్లడయ్యేవరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది.
సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలపై ఈసీ వార్నింగ్
మరోవైపు సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు మానుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. తప్పుదోవ పట్టించే సమాచారం సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని రాజకీయపార్టీలకు ఈసీ సూచించింది. తప్పుడు సమాచారం తమ దృష్టికి వచ్చిన మూడు గంటల్లో తొలగించాలని.. డీప్ ఫేక్ లాంటి వీడియోలకు దూరంగా ఉండాలని సూచించింది.లేదంటే ఐపిసి, ఐటి, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.