ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫ్ఘనిస్థాన్‌లో మెరుపు వరదలు.. ఒక్కరోజే 300 మందికిపైగా మృతి

international |  Suryaa Desk  | Published : Sun, May 12, 2024, 08:00 PM

భారీ వర్షాలకు అఫ్ఘనిస్థాన్‌ అల్లాడిపోతోంది. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బదాక్షాన్‌, బఘ్లాన్‌, ఘోర్‌, హెరాత్‌ ప్రావిన్సుల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా బఘ్లాన్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఆ ప్రావిన్సుల్లో భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఇప్పటివరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 2 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమైనట్లు తెలిపింది. ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం అఫ్ఘన్ డైరెక్టర్ రానా డెరాజ్ మాట్లాడుతూ.. బఘ్లాన్ ప్రావిన్సుల్లో వరదలకు 311 మంది మృత్యువాతపడ్డారని వాపోయారు. 2011 గృహాలు పూర్తిగా ధ్వంసం కాగా.. మరో 2,800 నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మూడు మసీదులు, నాలుగు పాఠశాలలు కూడా కుప్పకూలాయి. బోర్కా జిల్లాలో అధిక ప్రాణనష్టం జరిగిందని, ఇళ్లలో చిక్కుకుని 200 మంది చనిపోయారని ఆయన తెలిపారు.


బగ్లాన్ ప్రావిన్సుల్లోని ఐదు జిల్లాల్లో శుక్రవారం రాత్రి ఆకాశానికి చిల్లుపడినట్టు భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి వరదలు పోటెత్తి పలు ఇల్లు కొట్టుకుపోయాయి. వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు, వరదల కారణంగా 150 మంది చనిపోయారని, భారీ ఆస్తినష్టం వాటిల్లినట్టు తాలిబన్‌ ప్రభుత్వ ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. ‘బదాక్షాన్‌, బగ్లాన్‌, ఘోర్‌, హెరాత్‌ ప్రావిన్సులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రకృతి విధ్వంసం భారీ ఆస్తినష్టాన్ని మిగిల్చింది’అని ఆయన తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు చెప్పారు. గత కొద్ది వారాలుగా అఫ్ఘన్‌లో భారీ వర్షాలు నమోదువుతున్నాయి. ఆకస్మిక వరదలు సంభవించి ఏప్రిల్ నెల మధ్య నుంచి చాలా మంది ప్రాణాలు కోల్పోయరు.


వరద సహాయక చర్యల కోసం సైన్యంతో పాటు ఎమర్జెన్సీ విభాగం సిబ్బంది రంగంలోకి దిగారు. కూలిపోయిన ఇళ్లు, నివాసాల శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా? అని గాలిస్తున్నారు. వరదల కారణంగా ఇళ్లు కూలిపోయిన బాధితులకు ఆహారం, దుప్పట్లు, టెంట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఉత్తర అఫ్ఘన్‌, రాజధాని కాబూల్‌ను కలిపే రహదారి మూసివేశారు. గత నెల అఫ్ఘన్ పశ్చిమ ప్రాంతంలోనూ ఆకస్మిక వరద పోటెత్తి డజన్లు కొద్దీ ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా అతి భారీ వర్షం కురవడంతో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. ఇక, ఏటా అఫ్ఘనిస్థాన్‌లో భారీ వర్షాలు, వరదలు వందల మంది ప్రాణాలను తీస్తున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం సక్రమంగా లేకపోవడంతో వరదల సమయంలో కూలిపోతుంటాయి.


వాతావరణ మార్పుల కారణంగా అఫ్ఘనిస్థాన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన అఫ్ఘనిస్థాన్.. దశాబ్దాల తరబడి యుద్ధంతో నాశనమైంది. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు 2021 ఆగస్టులో ఉపసంహరించుకోవడంతో తిరిగి తాలిబాన్ నియంత్రణలోకి వెళ్లింది. అప్పటి నుంచి అక్కడ ప్రజల మరింత దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తాలిబన్ల ప్రజాకంటక పాలనతో ఇబ్బందులు పడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa