సాధారణంగా ఎవరైనా విమానాలు ఎందుకు ఎక్కుతారు. దూర ప్రాంతాలకు తొందరగా చేరుకుని పనులు చేసుకునేందుకు విమాన ప్రయాణాలు చేస్తారు. అయితే అందరికీ ఇది సాధ్యం కాదు. ఎందుకంటే విమానాల లాగానే వాటి టికెట్ ధరలు కూడా ఆకాశాన్నంటి ఉంటాయి. దీంతో కేవలం డబ్బున్న వారు మాత్రమే విమానాల్లో ప్రయాణిస్తారు. సామాన్యులు, పేదలు అయితే రైళ్లను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం హై క్లాస్ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. కేవలం విమానాల్లో ప్రయాణిస్తూ.. హై క్లాస్ ప్రయాణికుల దగ్గరి నుంచి వస్తువులు కొట్టేయడం చేస్తున్నారు. ఈ క్రమంలోనే 110 రోజుల్లోనే 200 సార్లు విమానాల్లో ప్రయాణించాడు. చివరికి పోలీసులకు దొరికిన చిన్న క్లూ.. అతడ్ని పట్టించింది.
ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల రాజేష్ కపూర్ అనే దొంగ దేశీయ విమానాల్లో తిరుగుతూ ప్రయాణికుల వద్ద ఉండే బంగారు, వెండి, డబ్బులు, ఇతర ఖరీదైన వస్తువులను చోరీ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే గత 110 రోజుల్లో 200 విమానాల్లో చోరీ చేసి ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. ఎయిరిండియా, విస్తారా లాంటి విమానాల్లో తరచుగా ఢిల్లీ, చండీగఢ్, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాలకు ప్రయాణిస్తూ దొంగతనాలు చేసేవాడు. ఈ క్రమంలోనే సోమవారం.. తోటి ప్రయాణికురాలి హ్యాండ్‌బ్యాగ్ నుంచి ఆభరణాలు దొంగిలించారన్న ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు రాజేష్ కపూర్‌ను అరెస్ట్ చేశారు. అతడ్ని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది కాలంగా 110 రోజుల్లో 200 విమానాలు ఎక్కిన రాజేష్ కపూర్.. ప్రయాణికుల నుంచి దొంగతనాలు చేసేవాడని గుర్తించారు.
ఈ క్రమంలోనే ఢిల్లీలోని పహార్‌గంజ్‌లో రాజేష్ కపూర్‌ను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు డీసీపీ ఉషా రంగనాని వెల్లడించారు. అతని వద్ద ఉన్న ఆభరణాలను ఢిల్లీలోని కరోల్ బాగ్‌కు చెందిన 46 ఏళ్ల శరద్ జైన్‌కు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా.. అతడ్ని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గత 3 నెలల్లో రెండు వేర్వేరు విమానాల్లో చోరీలు జరిగినట్లు నమోదైన కేసుల విచారణ సందర్భంగా.. ఎయిర్‌పోర్టు అధికారులతో కలిసి ఒక టీమ్‌ను ఏర్పాటు చేసి నిందితులని పట్టుకునేందుకు ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఏప్రిల్ 11 వ తేదీన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానంలో ఉన్న ఓ ప్రయాణికురాలి నుంచి రూ.7 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అంతకుముందు ఫిబ్రవరి 2 వ తేదీన అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి వచ్చిన మరో విమానంలోని మరో ప్రయాణికురాలి నుంచి రూ.20 లక్షల విలువైన ఆభరణాలు దొంగతనానికి గురయ్యాయి. ఈ రెండు ఘటనలపై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టినట్లు డీసీపీ ఉషా రంగనాని తెలిపారు. ఢిల్లీ, అమృత్‌సర్ విమానాశ్రయాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి కొందరు అనుమానితులను గుర్తించారు.
అందులో రాజేష్ కపూర్.. రెండు దొంగతనాలు జరిగిన రెండు విమానాల్లో ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఎయిర్‌లైన్స్ నుంచి రాజేష్ కపూర్ ఫోన్ నంబర్ తీసుకోగా.. టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఫేక్ మొబైల్ నంబర్ ఇచ్చినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే టెక్నాలజీ సాయం తీసుకున్న పోలీసులు.. రాజేష్ కపూర్ అసలు ఫోన్ నంబర్ కనుక్కొని.. చివరికి అతడ్ని పట్టుకున్నారు. ఈ క్రమంలోనే అతడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. ఇలాంటి మరో 5 ఘటనలు జరిగాయని.. అందులో ఒకటి హైదరాబాద్ నుంచి కూడా ఉందని పోలీసులు వెల్లడించారు.
చోరీ చేయగా వచ్చిన ఆభరణాలను విక్రయించి.. వచ్చిన డబ్బుతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో గ్యాంబ్లింగ్ ఆడగా.. భారీగా డబ్బును కోల్పోయినట్లు పోలీసులకు నిందితుడు చెప్పాడు. అంతేకాకుండా రాజేష్ కపూర్.. దొంగతనాలు, గ్యాంబ్లింగ్, నమ్మక ద్రోహం వంటి 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో 5 కేసులు ఎయిర్‌పోర్టుకు సంబంధించినవి ఉన్నాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా వృద్ధులను టార్గెట్ చేసుకుని రాజేష్ కపూర్ దొంగతనాలు చేస్తాడని పోలీసులు వెల్లడించారు. ఎయిర్‌పోర్టుల్లో ఒంటరిగా, బాగా డబ్బు, ఇతర విలువైన వస్తువులు కలిగి ఉన్న వారిని గుర్తించి.. వారి వెంటనే విమానంలోకి వెళ్తాడని.. అవసరం అయితే వారి పక్కనే కూర్చునేలా సీటును కూడా మార్చుకుంటాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. వారిని మాటల్లో పెట్టి తన పని తాను కానిస్తాడని పోలీసులు గుర్తించారు. మరోవైపు.. తన గుర్తింపు బయటపడకుండా విమాన టికెట్లు కూడా చనిపోయిన తన సోదరుడి పేరుతో బుక్ చేస్తాడని తేల్చారు.