ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మందుబాబులకు గుడ్‌న్యూస్.. తాగినా మీ లివర్ సేఫ్.. కొత్త జెల్ వచ్చేసింది!

national |  Suryaa Desk  | Published : Wed, May 15, 2024, 08:47 PM

మందుబాబుల కోసం సరికొత్త పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. ఒక జెల్‌ను కనిపెట్టారు. మందు తాగకముందు.. తాగేటపుడు లేదా తాగిన తర్వాత ఈ జెల్‌ను సేవిస్తే.. తాగిన మందు కారణంగా మన శరీరంలో ఉన్న లివర్‌కు ఎలాంటి ప్రమాదం ఉండదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ జెల్‌ను ఎలుకలపై ప్రయోగించగా.. విజయవంతంగా సక్సెస్ అయింది. ఇక మరిన్ని ప్రయోగాలు నిర్వహించిన తర్వాత ఈ జెల్‌ను త్వరలోనే మనుషులకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ జెల్‌కు సంబంధించిన విషయాన్ని నేచర్‌ నానోటెక్నాలజీ అనే జర్నల్‌ తాజాగా ప్రచురించింది.


స్విట్జర్లాండ్‌లోని జురిచ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు యాంటీ ఇన్‌టాక్సికెంట్‌ జెల్‌ను తయారు చేశారు. ఈ జెల్‌లో గ్లూకోజ్‌, గోల్డ్‌ నానో పార్టికల్స్‌తో పాటు వే ప్రోటిన్‌ నుంచి ఉత్పత్తైన నానో ఫైబర్‌లు కలిగి ఉంటుంది. ఈ నానో ఫైబర్‌లు ఐరన్‌తో కప్పి ఉంటాయి. గ్లూకోజ్‌, గోల్డ్‌ నానో పార్టికల్స్‌తో జరిగే రసాయనిక చర్యకు ఐరన్‌ ఉత్ప్రేరకంగా పనిచేసి హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ను ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ యాంటీ ఇన్‌టాక్సికెంట్‌ జెల్‌ ఎలుకలపై పరిశోధనల్లో మంచి ఫలితాలను ఇచ్చింది. ఎలుకలకు ఒక డోస్‌ మందు తాగించి అందులో కొన్నింటికి మాత్రమే ఈ యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్‌ను ఇచ్చారు. మరికొన్నింటికి కేవలం ఆల్కహాల్ మాత్రమే తాగించారు. అయితే జెల్‌ తీసుకోని ఎలుకల రక్తంతో పోలిస్తే.. జెల్‌ తీసుకున్న ఎలుకల రక్తంలో 16 శాతం తక్కువ ఆల్కహాల్‌ ఉన్నట్లు స్పష్టం అయింది.


అంతేకాకుండా ఈ యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్‌ తీసుకున్న ఎలుకల శరీరంలో ప్రమాదకర ఎసిటాల్డిహైడ్‌ కూడా కనిపించలేదని సైంటిస్ట్‌లు గుర్తించారు. ఈ జెల్ తీసుకున్న ఎలుకల లివర్‌పై కూడా మందు ప్రభావం పెద్దగా పడకపోవడం గమనార్హం. ఎలుకలపై బాగానే పనిచేసిన ఈ జెల్‌ను త్వరలోనే మనుషులపైన కూడా ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జెల్‌ను తీసుకున్న తర్వాత పేగుల్లో ఒకపొర ఏర్పడుతుంది. నానో ప్రోటీన్‌లతో తయారైన ఈ జెల్‌ జీర్ణం కావడానికి కొంత సమయం పట్టడంతో పేగుల్లోకి చేరిన ఆల్కహాల్‌.. రక్తంలోకి కలవడానికి ఆలస్యం అవుతుంది. అంతేకాకుండా ఈ జెల్.. హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను విడుదల చేయడంతో.. ఆల్కహాల్ తాగినపుడు ఏర్పడే ఎసిటాల్డిహైడ్‌ను ఎసిటిక్ యాసిడ్‌గా మార్చుతుంది. ఇది రక్తంలో కలిసినా లివర్‌పై పెద్దగా ప్రభావం పడదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో ఎక్కడా ప్రమాదకరమైన ఎసిటాల్డిహైడ్‌ లేకపోవడం వల్ల మందుబాబులకు పెద్దగా కిక్కు కూడా తెలియదని.. అంతేకాకుండా లివర్‌తోపాటు శరీరంలోని ముఖ్యమైన అవయవాలు మందు కారణంగా పాడయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.


అయితే అసలు మొత్తానికే మందు తాగకపోవడం శరీరానికి మంచిది అని జెల్‌ కనుగొన్న శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన రఫ్ఫేల్‌ మెజ్జెంగా వెల్లడించారు. కానీ మద్యం తాగేవారి ఆరోగ్యంపై, శరీరాలపై ప్రభావం చూపకుండా ఈ యాంటీ ఇన్‌టాక్సికెంట్‌ జెల్‌ ఉపయోగపడుతుందని చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com