ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టే ఆయన్ని పప్పు అంటున్నారు...లోకేశ్ పై పెద్దిరెడ్డి ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 19, 2024, 09:11 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారంనాడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డి కంపెనీకి చెందిన వాహనాలను విదేశాలకు పంపించేస్తున్నారని, సీఎం జగన్ విదేశాలకు చెక్కేశాడని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన మండిపడ్డారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే తాము కూడా వీధుల్లోకి వచ్చి మాట్లాడాల్సి ఉంటుందని హెచ్చరించారు. 


ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై ధ్వజమెత్తారు. ఈ లోకేశ్ మాట్లాడితే చాలు 'పాపాల పెద్దిరెడ్డి' అంటుంటాడని ఆరోపించారు. మీ నాన్నే పాపాల చంద్రబాబు... ఎంతోమందిని చంపించేశాడు.... వంగవీటి రంగా నుంచి పింగళి దశరథ వరకు అందరూ ఆయన బాధితులే... వారందరూ చనిపోయారు అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. అలాంటప్పుడు మీ నాన్నను పాపాల చంద్రబాబు అని పిలుచుకోవాలే తప్ప, నన్ను మాట్లాడినందువల్ల నీకు వచ్చేదేం లేదు అని స్పష్టం చేశారు. 


"నేను పాపాల పెద్దిరెడ్డినా, మంచి పెద్దిరెడ్డినా అనేది రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ అందరికీ తెలుసు. రాజకీయ విలువలను దెబ్బతీసే విధంగా మీరు ఇలా దుర్భాషలాడడం తగదు. రాజకీయాల్లో ఉండే వారందరూ ఇలాగే ఉంటారని ప్రజలు అనుకునేలా మీ ప్రవర్తన ఉంది. మీరు ఇదే విధంగా మాట్లాడితే మేం ఇంతకంటే ఎక్కువగా మాట్లాడగలం" అని పెద్దిరెడ్డి హెచ్చరించారు. 


"రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి... జూన్ 4న ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో టీడీపీ లేనిపోని అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలకు తెరలేపింది. పెద్దిరెడ్డి వాహనాల్లో వేల కోట్ల డబ్బు, వజ్రాలను ఇతర దేశాలకు తరలిస్తున్నారని నారా లోకేశ్ ట్వీట్ చేశాడు. ఇలాంటి ఆరోపణలు చేసేముందు లోకేశ్ వాస్తవాలు గమనించాలా, లేదా? లోకేశ్ ను పప్పు అని ప్రజలందరూ ఎందుకు పిలుస్తారో ఈ ట్వీట్ ను చూస్తేనే అర్థమవుతుంది. 


ఆ వాహనాలు ఆఫ్రికాలో మా ప్రాజెక్టు వద్దకు పంపిస్తున్నాం. ఆఫ్రికాలోని దారుస్సలామ్ పోర్టుకు వద్దకు వెళుతున్నాయి. వాహనాల్లో మేం ఏవైనా పంపిస్తుంటే ఇక్కడ కస్టమ్స్ చెకింగ్ ఉంటుంది, అక్కడ కూడా కస్టమ్స్ తనిఖీలు ఉంటాయి. అలాంటప్పుడు ఆ వాహనాల్లో డబ్బులు పెట్టేందుకు లోకేశ్ వంటి మూర్ఖులు తప్ప ఎవరూ సాహసించరు.  మీరేమో చార్టర్డ్ విమానాల్లో సూట్ కేసులు సింగపూర్, దుబాయ్ పంపిస్తుంటారు... మీకు అది అలవాటు. అందుకే మాపై కూడా అలాంటి ఆరోపణలే చేస్తున్నారు. ఇలాంటి బుద్ధితక్కువ మాటలకే నిన్ను పప్పు అని పిలుస్తారు.  ఇంతకంటే బుద్ధి హీనుడు దేవినేని ఉమామహేశ్వరరావు. నువ్వు ఐదేళ్లుగా ఇరిగేషన్ మంత్రిగా ఉండి, అనేక విధాలుగా లబ్ధి పొంది, వేలకోట్లు దోచుకుని, చంద్రబాబుకు దోచిపెట్టావు. ఇవాళ సిగ్గులేకుండా మాపై ఆరోపణలు చేస్తున్నావు. 


టిప్పర్లన్నీ ఇతర దేశాలకు పంపించేస్తున్నారు, పారిపోతున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో, ఆఫ్రికా దేశాల్లోనూ మేం ప్రాజెక్టులు చేపడుతున్నాం... మా వాహనాలు అక్కడ కూడా ఉంటాయి. మేం 2011 నుంచే అక్కడ వ్యాపారం చేస్తున్నాం. మా వాహనాలకు ఇక్కడ పనిలేకపోతే విదేశాల్లో మేం చేపట్టిన స్వర్ణ మెటల్స్ అనే కాపర్ ప్రాజెక్టు వద్దకు పంపిస్తున్నాం.  విదేశాల్లో మాకు ఫెర్రో సిలికా, ఫెర్రో మాంగనీస్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఒకటి పీఎల్ఆర్ అనుబంధ సంస్థకు చెందినది, మరొకటి జస్విన్ అనే అనుబంధ సంస్థది. కొత్తగా స్వర్ణ మెటల్స్ పేరుతో కాపర్ ప్రాజెక్ట్ చేపట్టాం కాబట్టి 100 వాహనాలు కావాల్సి రావడంతో, విడతల వారీగా ముంబయి పోర్టు నుంచి పంపిస్తున్నాం. 


వాస్తవాలు ఇలా ఉంటే... టీడీపీ నేతలు చిలువలుపలువలుగా ప్రచారం చేస్తున్నారు. ఆ వాహనాల్లో మేం ఏవేవో పంపించేస్తున్నాం, రాష్ట్రం నుంచి పారిపోతున్నాం, దేశం నుంచి పారిపోతున్నాం అని ఆరోపిస్తున్నారు. దేవినేని ఉమా నన్నే కాదు... ఇతర వైసీపీ నేతలను కూడా ఇదే రీతిలో మాట్లాడుతున్నారు. అందరూ విదేశాలకు పారిపోయేందుకు పాస్ పోర్టులు రెడీ చేసుకున్నారు, వీసాలు రెడీ చేసుకున్నారు అంటున్నారు.   మా నాయకుడు (జగన్) విదేశాలకు వెళితేనేమో ఆయన పారిపోయినట్టు... వాళ్ల నాయకుడు (చంద్రబాబు) విదేశాలకు వెళితే వైద్య పరీక్షల కోసం వెళ్టినట్టంట! ఇలాంటి రాతలు రాసే పచ్చ పత్రికలు ఉన్నాయి కాబట్టే టీడీపీ వాళ్లు ఇలా మాట్లాడుతున్నారు. 


ఉమా నీకు బుద్ధి ఉందా? చంద్రబాబు దగ్గర ఏం తప్పు చేశావో... ఐదేళ్లు మంత్రిగా చేసి కూడా కనీసం టికెట్ తెచ్చుకోలేకపోయావు? నీ నియోజకవర్గంలో మా పార్టీ నుంచి వెళ్లిన నేతకు టికెట్ ఇచ్చారు. నువ్వు అంతకంటే అసమర్థుడివి కాబట్టే నీకు టికెట్ ఇవ్వలేదని అర్థమవుతోంది. అలాంటి నువ్వు మా గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. నీకున్న పరిజ్ఞానం ఏమైంది... నువ్వు కూడా పిచ్చి లోకేశ్ మాదిరే మాట్లాడుతున్నావు" అంటూ పెద్దిరెడ్డి నిప్పులు చెరిగారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com