తుని పరిధిలో 16వ నెంజరు జాతీయ రహదారి ఆనుకుని తేటగుంట శివారు రాజుల కొత్తూరు వద్ద ఆదివారం వివస్త్రగా ఉన్న ఓ మహిళ మృతదేహం కనిపించడం తీవ్ర సంచలనం సృష్టించింది. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు మహిళను చిత్రహింసకు గురి చేసి అత్యాచారం చేసి చంపి ఈ ప్రాంతంలో పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. సంఘటనా స్థలంలోని సమీప పరిసరాలు, హోటల్స్‌లో ఆరా తీస్తున్నారు. ఆర్. కొత్తూరు శివారు ఎర్రకోనేరు వద్ద మహిళ మృతదేహాన్ని తరలించేందుకు వినియోగించిన బెడ్షీడ్ను పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి రూరల్ సీఐ ఎస్వీవీఎస్ మూర్తి వివరాలు వెల్లడించారు. హత్యకు గురైన మహిళ తుని ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో వ్యభిచారం చేస్తూ జీవనోపాధి పొందుతున్నట్లు తెలిపారు. తుని పట్టణంలో దిబ్బలపాలెంలో రాపర్తి అమ్ములు అనే అమెతో కలిసి ఉంటుందని ఆ ప్రాంతంలో ఆమెను కుమారిగా పిలుస్తారని తెలిసిందన్నారు. ఈ దారుణానికి పాల్పడిన కారకులను త్వరలోనే పట్టుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.