భువనమోహన రూపుడైన అన్నవరం, సత్యదేవుడి కల్యాణం ఆదివారం రాత్రి రత్నగిరిపై అంగరంగ వైభవంగా జరిగింది. ఆద్యంత రహితుడైన స్వామి, అనంతలక్ష్మి అమ్మవారిని పరిణయమాడిన వేళ ప్రకృతి పరవశించగా రత్నగిరి పులకరించింది. మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, సుగందభరిత పుష్ప పరిమళాలతో స్వామి సన్నిధి అణువణువునా శోభిల్లింది. కల్యాణోత్సవంలో భాగంగా ఉదయం అంకురార్పణతో విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం నాందీదేవత పఠన నిర్వహించిన అర్చకులు ధ్వజారోహణం చేసి గరుడ ద్విభాగం ఎగురవేసి స్వామికల్యాణానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. చైర్మన్ ఐ.వి రోహిత్ దంపతులు పండితులకు దీక్షా వస్త్రాలను అందజేశారు. రాత్రి 7 గంటలకు బాజాభజంత్రీలు, వేదమంత్రాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ సత్యదేవుడిని వెండిగరుడ వాహనంపైన అనంతలక్ష్మి అమ్మవారిని వెండి గజవాహనంపై గ్రామోత్సవం జరుపుకుని కల్యాణవేదిక వద్దకు చేరుకున్నారు. సర్వశిల్పకళా శోభితమైన, వివిధ పరిమళ పుష్పాలతో విద్యుద్దీప అలంకరణతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన వార్షిక కల్యాణవేదికపై స్వామి, అమ్మవార్లను అధిష్ఠింపజేసి అర్చకస్వాములు కల్యాణ తంతుకు శ్రీకారం చుట్టారు. ఈ వివాహ కార్యక్రమానికి సీతారాములు పెండ్లి పెద్దలుగా వ్యవహరించడంతో మరో వేదికపై వారిని ఆశీనులు గావించి విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం కన్యావరుణలు జరిపి అమ్మవారితో మంగళగౌరీపూజను జరిపించారు. స్వామి, అమ్మవార్ల వంశవృక్షాన్ని వివరించే ప్రవరను వేదపండితులు పఠించారు. ద్విజత్వాన్ని ప్రసాదించే సువర్ణ యజ్ఞోపవీతాన్ని మంత్రపూర్వకంగా స్వామికి అలంకరించారు. శ్రీచరణుని పాదాలను పవిత్రజలంతో కడిగి పాద ప్రక్షాళన కార్యక్రమం మదుపర్క ప్రాశన జరిపి మదుపర్కాలను స్వామికి ధరింపచేశారు. చతుర్వేద పండితులు దేశకాలమాన పరిస్థితులు వివరించే మహాసంకల్పం చెప్పి చూర్ణికమంత్రాలు పఠించారు. సుముహుర్త వేళ భక్తరక్షణలో ఒకరికొకరు బాసటగా ఉండాలంటూ జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని స్వామి, అమ్మవార్లు ఒకరి శిరస్సుపై మరొకరు ఉంచారు. అమ్మవారికి దివ్యతేజస్సు ప్రసాదించే యుగచ్చిద్రాభిషేకం నిర్వహించగా భక్తజన గోవింద నామస్మరణ మద్య మాంగల్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా అంటూ స్వామి, అమ్మవారి మెడలో మూడుముళ్లు వేశారు. స్వామి, అమ్మవార్లు ఒకరి శిరస్సుపై మరొకరు మంచిముత్యాల తలంబ్రాలు వేసుకుంటూ భక్తులకు వేడుక కలిగించారు. పట్టు పీతాంబరాలు, విశేష ఆభరణాలతో నుదుట తిలకం, బుగ్గన చుక్కతో స్వామి, అమ్మవార్ల దివ్య తేజస్సుతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కల్యాణ తంతును ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యం, ఇంద్రగంటి నరసింహమూర్తి, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, పాలంకి చినపట్టాభి తదితరులు నిర్వహించగా వేడుకలో ఈవో రామచంద్రమోహన్, చైర్మన్ ఐ.వి రోహిత్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ పట్టువస్త్రాలను సమర్పించారు. వైదిక కార్యక్రమాలను చామర్తి కన్నబాబు, పాలంకి పట్టాభి, ఇంద్రగంటి వెంకటేశ్వర్లు తదితరులు నిర్వహించారు. కల్యాణం అనంతరం 8 ప్రత్యేక కౌంటర్ల ద్వారా తలంబ్రాల అక్షింతల ప్యాకెట్లను భక్తులకు పంపిణీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 150 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కలెక్టర్ నివాస్ కల్యాణ వేడుకలకు హాజరయ్యారు. పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి ఆధ్వర్యంలో 150 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.