అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాళ్ల దాడికి సంబంధించి సస్పెండైన పట్టణ సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ గౌస్‌బాషాను సిట్ విచారించింది. పోలింగ్ రోజున పట్టణంలోని ఓంశాంతి నగర్, పాతకోట ప్రాంతాల్లో రాళ్ల దాడికి కారణం ఎవరు.. ఎవరెవరి ప్రమేయం ఉంది.. ఎందుకు కట్టడి చేయలేకపోయారని వారిని సిట్ సభ్యులు డీఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ భూషణం, ఏసీబీ ఇన్‌స్పెక్టర్ జీఎల్ శ్రీనివాస్ ప్రశ్నించినట్లు సమాచారం. దాడి జరిగాక కూడా బందోబస్తు పెంచడంపై ఎందుకు శ్రద్ధ పెట్టలేదని సూటిగా అడిగినట్లు తెలుస్తోంది. చాలినంత మంది సిబ్బందిని నియమించి ఉండి ఉంటే రెండోరోజు అల్లర్లు జరిగి ఉండేవి కాదనీ, ఆ మేరకు ఉన్నతాధికారులకు ఎందుకు నివేదించలేకపోయారని నిలదీసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ బృందం తాడిపత్రి రూరల్ పోలీసు స్టేషన్‌లో ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు విచారణ జరిపింది. పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు జరిగిన హింసాకాండకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రాళ్లదాడిలో ఎంతమంది పాల్గొన్నారు, ఎంత మందిని అదుపులోకి తీసుకున్నారో ఆరాతీశారు. 11-12 గంటలపాటు నిలదీయడంతో పోలీసు అధికారులు వణికిపోయారు. అనంతరం సిట్ సభ్యులు.. డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఇంకోవైపు.. రూరల్ స్టేషన్‌లో సిట్ బృందాన్ని వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్య రమాదేవి కలిశారు. తన ఇంట్లో, కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలు, ఫర్నిచర్‌ను పోలీసులు ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు.